‘ఛలో సెక్రటేరియెట్కు’ బ్రేక్ వేయడం కోసం ఏపీలో అర్ధరాత్రి హైడ్రామా..
ఇటీవల ప్రభుత్వం విడుదల చేసిన డీఎస్సీ నోటిఫికేషన్ పై గత కొద్ది కాలంగా అభ్యర్థులు చేస్తున్న ఆందోళనల గురించి అందరికీ తెలిసిందే. ఈ నేపథ్యంలో వీరికి మద్దతునిస్తూ ఏపీసిసి చీఫ్ వైయస్ షర్మిల చలో సెక్రటేరియట్ ఉద్యమానికి పిలుపునిచ్చారు. ఇందులో పాల్గొనడం కోసం ఆమె కొడుకు పెళ్లి జరిగిన అనంతరం నేరుగా బుధవారం రాత్రి గన్నవరం చేరుకున్నారు. అక్కడ నుంచి రామచంద్రారావు నివాసానికి వెళ్లడానికి ప్రయత్నించిన షర్మిలకు పోలీసుల వల్ల ఇబ్బంది ఎదురయింది.. చలో సెక్రటేరియట్ కు అనుమతి లేదు అని పోలీసులు అప్పటికే క్లారిటీ ఇచ్చేశారు.
అనుమతి ఉన్నా లేకపోయినా.. తమ ఉద్యమం ఆగేది లేదు అని కాంగ్రెస్ నాయకులు కూడా ఖచ్చితంగా చెప్పారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ నాయకులను కట్టడి చేయడం కోసం ఎక్కడికక్కడ గృహనిర్బంధాలు రాష్ట్రవ్యాప్తంగా జరిగాయి. సుమారు 200 మంది నాయకులను హౌస్ అరెస్ట్ చేసి ఇంటికే పరిమితం చేశారు. రఘువీరారెడ్డి, గిడుగు రుద్రరాజు లాంటి ఎందరో నేతలను ఇల్లు కదలనివ్వకుండా కట్టుదిట్టం చేశారు. ఇక షర్మిల ఉద్యమంలో ఎక్కడ పాల్గొంటుందో అనే ఉద్దేశంతో విమానాశ్రయం నుంచి ఆమెను పోలీసులు ఫాలో అయ్యారు.
అయితే ముందుగానే ఈ సమాచారం అందుకున్న షర్మిల కేవీపీ ఇంటికి చేరుకుంటే అక్కడ తనని గృహనిర్బంధం చేసే అవకాశం ఉంది అని గ్రహించారు. అందుకే షర్మిల తన మార్గాన్ని మార్చుకొని విజయవాడలోని పార్టీ కార్యాలయానికి చేరుకున్నారు. రాత్రి మొత్తం ఆంధ్ర రత్న భవన్ లోనే ఆమె బస చేశారు. అయితే పోలీసులు పార్టీ కార్యాలయాన్ని సైతం చుట్టుముట్టారు. ఈ నేపథ్యంలో ఎక్స్ వేదికగా షర్మిల పోలీసుల వైఖరిపై నిప్పులు చెరిగారు. ఎవరు ఎన్ని అడ్డంకులు పెట్టిన తమ పోరాటం ఆగేది లేదు అని స్పష్టం చేశారు.
“ఉద్యోగాలు లేక అలమటిస్తున్న నిరుద్యోగుల పక్షాన పోరాటానికి పిలుపునిచ్చినందుకు మమ్మల్ని హౌజ్ అరెస్ట్ చేయిస్తారా? ఉద్యమంలో పాల్గొనడానికి తరలివస్తున్న పార్టీ శ్రేణులను ఎందుకు ఆపుతున్నారు? ప్రజాస్వామ్యంలో మాకు నిరసన తెలిపే హక్కు కూడా లేదా? ఒక మహిళను అయి ఉండి కూడా ఈరోజు హౌస్ అరెస్ట్ కాకుండా ఉండాలి అనే ఉద్దేశంతో పార్టీ కార్యాలయంలో గడపవలసిన పరిస్థితి రావడం మీకు అవమానంగా లేదా? మేమేమన్నా తీవ్రవాదులమా.. లేక సంఘ విద్రోహశక్తులమా? ఎందుకని మమ్మల్ని ఆపాలని చూస్తున్నారు.. దీని వెనుక మీ భయమేనా కారణం? మీ అసమర్ధత కప్పిపుచ్చుకోవడానికి ఎంత ప్రయత్నించినా.. నిరుద్యోగుల పక్షాన చేసే మా పోరాటం మాత్రం ఆపేది లేదు” అని షర్మిల తన పోస్టులో పేర్కొన్నారు.













