అసెంబ్లీకి జగన్.. తాడోపేడో తేల్చుకునేందుకు సిద్ధం..!!
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఘోర పరాజయం పాలైన సంగతి తెలిసిందే. ఆ పార్టీకి కేవలం 11 సీట్లు మాత్రమే దక్కాయి. గతంలో ఏ పార్టీకి ఇంత తక్కువ సీట్లు రాలేదు. గత ఎన్నికల్లో 151 సీట్లు సాధించిన ఆ పార్టీ ఇప్పుడు కేవలం 11 స్థానాలకే పరిమితం కావడం అస్సలు జీర్ణించుకోలేకపోతోంది. పార్టీ అధినేత జగన్ కూడా ఫలితాలపై తీవ్ర నిరాశలో కూరుకుపోయారు. ఇంటింటికీ డబ్బులిచ్చినా ఓడిపోవడంపై ఆయన అసంతృప్తితో ఉన్నారు. 11 మందితో అసెంబ్లీకి వెళ్లినా పెద్ద ఉపయోగం ఉండదనేలా ఆయన గతంలో కామెంట్స్ చేశారు. అయితే తాజా పరిణామాల నేపథ్యంలో ఆయన అసెంబ్లీకి వెళ్లాలని నిర్ణయించుకున్నట్టు సమాచారం.
వైసీపీకి ఈ ఎన్నికల్లో కనీసం ప్రతిపక్ష హోదా కూడా దక్కలేదు. కనీసం 18 స్థానాలు గెలుచుకుని ఉంటే ఆ హోదా దక్కేది. దీంతో వైసీపీ అధినేత జగన్ కూడా అందరిలాగే ఒక సాధారణ ఎమ్మెల్యే. అందరి ఎమ్మెల్యేలలాగే ఆయనకు సౌకర్యాలుంటాయి. అంతేకాని ప్రతిపక్షనేతకు ఉన్నట్టు కేబినెట్ ర్యాంక్ దక్కదు. ఇది ఆ పార్టీ శ్రేణులను జీర్ణించుకోలేకుండా చేస్తోంది. అసెంబ్లీ సమావేశాల మొదటి రోజు సభ్యుల ప్రమాణ స్వీకారం సందర్భంగా జగన్ కు ప్రతిపక్ష హోదా ఇవ్వాలని వైసీపీ కోరింది. సీఎం తర్వాత ప్రమాణం చేసే అవకాశం ఇవ్వాలని అభ్యర్థించింది. అయితే ప్రభుత్వం అందుకు అంగీకరించలేదు. దీంతో మాజీ ముఖ్యమంత్రిగా గౌరవించి వరుస క్రమంలో కాకుండా ఆయనకు మంత్రుల తర్వాత ప్రమాణం చేసే అవకాశం కల్పించింది.
అయితే ఇది అవమానంగానే భావిస్తోంది వైసీపీ. ప్రతిపక్ష హోదా కూడా లేకుండా అసెంబ్లీకి వెళ్లడం ఆ పార్టీ అధినేత జగన్ కు ఏమాత్రం ఇష్టం లేనట్టు సమాచారం. 11 మంది ఎమ్మెల్యేలతో సభకు వెళ్లినా అక్కడ న్యాయం జరుగుతుందని ఆశించలేమని.. కాబట్టి ఏదైనా ప్రజాక్షేత్రంలోనే తేల్చుకుందామని పార్టీ శ్రేణులకు చెప్తూ వచ్చారు. దీంతో ఆయన అసెంబ్లీకి వెళ్లకపోవచ్చని అందరూ అనుకున్నారు. అయితే కొందరు సీనియర్లు మాత్రం అసెంబ్లీకి వెళ్లాలని.. అక్కడే గళం వినిపించాలని సూచిస్తూ వచ్చారు. సోమవారం నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమవుతున్న నేపథ్యంలో జగన్ వస్తారా.. రారా.. అనే ఉత్కంఠ నెలకొంది.
సోమవారం నుంచి ప్రారంభమయ్యే అసెంబ్లీ సమావేశాలకు హాజరవ్వాలని జగన్ నిర్ణయించుకున్నారు. వినుకొండలో రషీద్ కుటుంబాన్ని పరామర్శించడానికి వెళ్లినప్పుడు ఈ విషయం స్వయంగా ఆయనే చెప్పారు. ఎంపీలతో జరిగిన సమావేశంలో కూడా ఈ మాట మరోసారి వెల్లడించారు. అసెంబ్లీలో హత్యాకాండలపై నిలదీస్తామని తెలిపారు. దీంతో జగన్ అసెంబ్లీకి హాజరు కాబోతున్నట్టు వెల్లడైంది. అయితే గతంలో జగన్ అధికారంలో ఉన్నప్పుడు అసెంబ్లీలో ప్రతిపక్షంపైన సెటైర్లు వేయడానికే ఎక్కువ సమయం తీసుకున్నారు. ఇప్పుడు టీడీపీ ఏం చేస్తుందనేది వేచి చూడాలి.













