PUBG Addiction: పబ్జీ గేమ్ ఆడి నరాలు చిట్లి…
Meerut (Uttar Pradesh) : ఆన్లైన్ గేమ్‌ల వ్యసనం ఎంత ప్రమాదకరంగా మారుతుందో చెప్పడానికి మేరఠ్‌లో జరిగిన ఈ ఘటనే నిదర్శనం. మేరఠ్‌కు చెందిన మహ్మద్ కైఫ్ (22) అనే యువకుడు గత నాలుగు నెలలుగా ‘పబ్-జీ’ (PUBG) గేమ్‌కు విపరీతంగా అలవాటు పడి, చివరికి ప్రాణాలు కోల్పోయాడు.
అర్ధరాత్రి వరకు ఆట, ఒక్కసారిగా కుప్పకూలిన యువకుడు: గత శుక్రవారం రాత్రి కైఫ్ తన హెడ్‌ఫోన్స్ పెట్టుకుని అర్ధరాత్రి వరకు గేమ్ ఆడుతూనే ఉన్నాడు. గంటల కొద్దీ ఏకాగ్రతతో, ఒత్తిడితో కూడిన గేమ్ ఆడటం వల్ల అతని మెదడుపై తీవ్ర ప్రభావం పడింది. ఒక్కసారిగా ఆ తీవ్రతను భరించలేక కైఫ్ స్పృహ తప్పి కుప్పకూలిపోయాడు. గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే అతడిని హాస్పిటల్‌కు తరలించారు.
300 దాటిన రక్తపోటు, చిట్లిపోయిన మెదడు నరాలు: ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సమయంలో కైఫ్ చెవులు, ముక్కు నుంచి రక్తం కారడం చూసి వైద్యులు దిగ్భ్రాంతికి గురయ్యారు. ఆదివారం రాత్రి వరకు ప్రాణాలు కాపాడటానికి వైద్యులు ప్రయత్నించినప్పటికీ ఫలితం లేకపోయింది. విపరీతమైన మానసిక ఒత్తిడి (Mental Pressure) కారణంగా అతని రక్తపోటు (BP) ఒక్కసారిగా 300 దాటిపోయింది. అంతటి అధిక రక్తపోటును మెదడు భరించలేకపోవడంతో లోపల నరాలు చిట్లిపోయి (Brain Hemorrhage), అంతర్గత రక్తస్రావం జరగడం వల్లే కైఫ్ మరణించినట్లు డాక్టర్లు స్పష్టం చేశారు.
తల్లిదండ్రులకు హెచ్చరిక: మొబైల్ గేమ్‌లలో గెలుపు కోసం ఆరాటపడుతూ గంటల కొద్దీ మెదడుపై ఒత్తిడి పెంచుకోవడం ప్రాణాంతకమని ఈ ఘటన హెచ్చరిస్తోంది. యువత ఇలాంటి వ్యసనాలకు దూరంగా ఉండాలని, లేనిపక్షంలో ఊహించని అనారోగ్య సమస్యలు తలెత్తుతాయని వైద్యులు సూచిస్తున్నారు.













