ఓటమి విజయానికి నాంది : చంద్రబాబు
తెలంగాణలో ఇంటర్ పరీక్షలు తప్పిన 16 మంది విద్యార్థుల ఆత్మహత్యలపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీవ్ర విచారం వ్యక్తం చేశారు. విద్యార్థుల మరణం తనను తీవ్రంగా కలచివేసిందంటూ వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ మేరకు ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. విద్యార్థులకు నా విజ్ఞప్తి ఒక్కటే.. కేవలం పరీక్షలు, పాస్కావడం ఒక్కటే జీవితం కాదు. అవి మీ ప్రతిభకు గుర్తింపు మాత్రమే. పరీక్షల్లో తప్పినంత మాత్రాన మీ జీవితాలు అర్థంతరంగా ముగించడం బాధాకరం. మీపై పెట్టుకున్న కన్నవారి ఆశలు కడతేర్చకండి. తల్లిదండ్రులకు కడుపుకోత మిగల్చకండి. ఓటమి విజయానికి నాంది. మళ్లీ మంచి ఫలితాల కోసం కష్టపడి చదవండి అని పేర్కొన్నారు.













