ఐక్యరాజ్య సమితి సదస్సుకు… ఏపీ విద్యార్థిని
ఐక్యరాజ్య సమితి విద్యా సదస్సులో పాల్గొనేందుకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అల్లూరి సీతారామరాజు జిల్లా చింతూరు డివిజన్లోని ఎటపాక గ్రామ విద్యార్థిని మోతుకూరి చంద్రలేఖ ఎంపికైంది. ఈ మేరకు ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి ఆమెకు సమాచారం అందింది. ఈ ఎంపిక కోసం తొలుత సమగ్రశిక్ష అభియాన్ ఆధ్వర్యంలో రాష్ట్రంలో అమలవుతున్న విద్యా విధానంపై విద్యార్థులకు రాత పరీక్ష నిర్వహించారు. ఎటపాక కేజీబీవీలో గత విద్యా సంవత్సరం పదో తరగతి చదివిన ఈ విద్యార్థిని జులై 31న జరిగిన రాత పరీక్షలో ఉత్తీర్ణురాలైంది. ఈ నెల 3న నిర్వహించిన ముఖాముఖిలో పాల్గొని విద్యా సదస్సులో పాల్గొనేందుకు ఎంపికైంది. రాష్ట్రంలో విద్యా విధానంపై అక్కడ చంద్రలేఖ మాట్లాడనుందని సమగ్ర శిక్ష అధికారులు తెలిపారు. రాష్ట్రంలోని కేజీబీవీ విద్యాలయాల విభాగంలో ఈ విద్యార్థిని ఒక్కరే ఎంపికవడం విశేషం. విద్యార్థిని తండ్రి రామారావు ట్రాలీ ఆటో నడుపుతుంటారు. ఆయన కష్టంతోనే కుటుంబం నడుస్తోంది.













