YCP – DSC: డీఎస్సీపై వైసీపీ ఫేక్ ప్రచారం.. నెటిజన్ల సెటైర్లు..!!

ఆంధ్రప్రదేశ్‌లో ఉపాధ్యాయ నియామకాల కోసం చంద్రబాబు నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం (NDA Govt) డీఎస్సీ నోటిఫికేషన్ (DSC Notification) ను ఈ నెల 20న విడుదల చేసింది. దీని ద్వారా 16,347 పోస్టుల భర్తీ చేయనున్నట్టు ప్రకటించింది. ఈ నోటిఫికేషన్‌ను ముఖ్యమంత్రి చంద్రబాబు (CM Chandrababu) 75వ జన్మదినం సందర్భంగా ప్రకటించారు. తాము అధికారంలోకి వస్తే మెగా డీఎస్సీ (Mega DSC) ఇస్తామని ఎన్నికలకు ముందే టీడీపీ (TDP) హామీ ఇచ్చింది. అందులో భాగంగానే ఈ నోటిఫికేషన్ ఇచ్చింది. జూన్ 6 నుంచి జులై 6 వరకూ పరీక్షలు జరుగుతాయి. ఆగస్టులో ఫలితాలు విడుదల చేస్తారు. అయితే, ఈ నోటిఫికేషన్‌పై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ (YSRCP) తీవ్ర విమర్శలు గుప్పించడంతో రాజకీయ వివాదం తలెత్తింది.
23వేలకు పైగా టీచర్ ఖాళీలు (Teacher Posts) ఉన్నప్పటికీ కేవలం 16,347 పోస్టులకు మాత్రమే నోటిఫికేషన్ ఇచ్చారని వైసీపీ (YCP) విమర్శిస్తోంది. అయితే వైసీపీ విమర్శలపై సోషల్ మీడియాలో సెటైర్లు వెల్లువెత్తుతున్నాయి. 2019-2024 మధ్య వైసీపీ అధికారంలో ఉండేది. 23వేలకు పైగా ఖాళీలున్నాయని అప్పటి విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ (Botsa Satyanarayana) అసెంబ్లీలోనే ప్రకటించారు. అయినా ఒక్క పోస్టును కూడా వైసీపీ హయాంలో భర్తీ చేయలేదు. కానీ ఇప్పుడు టీడీపీ ప్రభుత్వం నోటిఫికేషన్ ఇస్తే దాన్ని వైసీపీ విమర్శిస్తోంది. అంతటితో ఆగకుండా తమ హయాంలో 21,108 టీచర్ పోస్టులను భర్తీ చేసినట్లు సోషల్ మీడియా వేదికలలో ప్రచారం చేసుకుంటోంది. 1998, 2008, 2018 సంవత్సరాల నియామకాలను కూడా తమ ఖాతాలో వేసుకుంది. 2024లో హడావిడిగా విడుదల చేసిన డీఎస్సీ నోటిఫికేషన్‌ను కోర్టులు తప్పబట్టడంతో ఆ ప్రక్రియ ఆగిపోయింది. కానీ దాన్ని కూడా వైసీపీ తమ ఘనతగానే చెప్పుకోవడం విమర్శలకు దారితీసింది. వైసీపీ ఫేక్ ప్రచారం అంటూ నెటిజన్లు మండిపడుతున్నారు.
వాస్తవానికి డీఎస్సీ అంటేనే చంద్రబాబు గుర్తొస్తారు. ఆయన నేతృత్వంలోనే భారీగా టీచర్ పోస్టులు భర్తీ అయ్యాయి. మొత్తం 11 సార్లు టీడీపీ ప్రభుత్వాలు డీఎస్సీలు నిర్వహించాయి. 1,80,208 మందికి టీచర్ ఉద్యోగాలు ఇచ్చినట్లు ఆ పార్టీ నేతలు గొప్పగా చెప్పుకుంటున్నారు. దీనికి విరుద్ధంగా, వైసీపీ పాలనలో ఒక్క డీఎస్సీ కూడా విజయవంతంగా పూర్తి కాలేదు. కానీ వైసీపీ మాత్రం తామే గ్రేట్ అన్నట్టు ప్రచారం చేసుకుంటూ టీడీపీని తప్పుబడుతోంది. ఇలాంటి ఫేక్ ప్రచారాలు చేయడం వైసీపీకి అలవాటేనని కొందరు విమర్శిస్తున్నారు. మొత్తంగా, చంద్రబాబు ప్రభుత్వం విడుదల చేసిన మెగా డీఎస్సీ నోటిఫికేషన్ ఉపాధ్యాయ అభ్యర్థులకు ఆశాకిరణంగా మారినప్పటికీ, వైసీపీ ఆరోపణలు చర్చనీయాంశంగా మార్చాయి.