టీడీపీ గూటికి వైసీపీ ఎంపీ ఎంట్రీ తో మారనున్న కర్నూలు లెక్కలు..
వైసీపీ ఎంపీ సంజీవ్ కుమార్ నేడు టీడీపీ తీర్థం పుచ్చుకోనున్నారు. 2019 ఎన్నికల్లో వైసీపీ తరఫున పోటీ చేసిన సంజీవ్ కుమార్ విజయం సాధించారు. కర్నూలు జిల్లాలో చేనేత సామాజికవర్గానికి చెందిన సంజీవ్ కుమార్కు మంచి పేరు, పలుకుబడి ఉన్నాయి. ఆయన కర్నూల్ నగరంలో డాక్టర్ గా కూడా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. సంజీవ్ కుమార్.. ఎంపీగా గెలిచిన తర్వాత పార్టీలో సరియైన ప్రాముఖ్యత లేక పోవడం.. స్వతంత్రంగా పనిచేసే అవకాశం అందకపోవడంతో తీవ్ర అసంతృప్తికి గురి అయ్యారు. అందుకే ఈసారి ఎంపీగా కాకుండా ఎమ్మిగనూరు నుంచి ఎమ్మెల్యే బరిలోకి దిగాలని భావించారు. అక్కడ తమ సామాజిక వర్గానికి చెందిన ఓటర్ల సంఖ్య ఎక్కువ ఉండడంతో విజయం కూడా ఖచ్చితమని ఆయన భావించారు. అయితే ఆ నియోజకవర్గం సిట్టింగ్ ఎమ్మెల్యే సూచనల మేరకు ఆ టికెట్ మాచాని వెంకటేష్ కు వైసిపి అధిష్టానం కేటాయించింది. సంజీవ్ కుమార్ తనకు టికెట్ ఇవ్వడానికి నిరాకరించడం తో వైసీపీతో పాటు పార్లమెంటు సభ్యత్వానికి కూడా రాజీనామా చేసి పార్టీ నుంచి బయటకు వచ్చారు. ఈరోజు ఆయన టిడిపి పార్టీలో చేరబోతున్నారు. టీడీపీ లో సంజీవ్ కుమార్ చేరిక వల్ల కర్నూలు జిల్లాలో తెలుగుదేశం పార్టీకి మరింత బలం పెరుగుతుందని ఆశిస్తున్నారు.













