హైకోర్టలో క్వాష్ పిటిషన్లు వేసిన రఘురామ
రోజు రోజుకూ ముదిరి పాకాన పడుతున్న వైసీపీ పార్టీలోని అసమ్మతి వ్యవహారం పార్లమెంట్ నుంచి పోలీస్ స్టేషన్ల దాకా అన్నట్టు కొనసాగుతూనే ఉంది. గత కొంత కాలంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి తలనొప్పిగా మారిన స్వంత పార్టీ ఎంపీ వ్యవహారంపై ఆ పార్టీ తాడోపేడో అన్నట్టు వెళుతుంటే అందుకు తాను కూడా ధీటుగా స్పందిస్తున్నారు నర్సాపురం ఎంపీ రఘురామ కృష్ణరాజు. గత కొన్ని రోజులుగా స్వంత పార్టీ నేతలతో ఢీ అంటే ఢీ అంటూ తలపడుతున్న రఘరామ… గతంలో తన దిష్టి బొమ్మల దగ్ధంపై పోలీసు కేసు పెట్టిన విషయం కూడా తెలిసిందే. మరోవైపు ఎంపీపై ముప్పేట దాడికి సిద్ధమైన వైసీపీ ఓ వైపు రాజ్యాంగ ప్రకారం ఎంపీని అనర్హుడ్ని చేయాలని ప్రయత్నిస్తూనే ఇతర మార్గాల్లోనూ అతన్ని ఇరుకున పెట్టే యత్నాలు చేస్తోంది. అందులో భాగంగా ఇటీవల ఎంపీపై పోడూరు పోలీస్ స్టేషన్లో మంత్రి శ్రీరంగనాథరాజు, భీమవరంలో ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ ఫిర్యాదు చేశారు. తనను, తన సహచర ఎమ్మెల్యేలను పందులు అంటూ కించపరిచేలా మాట్లాడారని గ్రంధి ఫిర్యాదులో పేర్కొన్నారు.
తమ పార్టీలో వర్గ వైషమ్యాలు రెచ్చగొట్టేలా, శాంతి భద్రతలకు విఘాతం కలిగేలా చేసారని గ్రంధి శ్రీనివాస్ కంప్లైంట్ చేశారు. దీంతో రాష్ట్రంలోని తాజా పరిణామాల నేపధ్యంలో పరిస్థితిని పోలీసు కేసు నమోదవడాన్ని గమనించిన ఎంపీ రఘురామ కృష్ణరాజు కీడును శంకించారు. వెంటనే ఏకంగా హైకోర్టులో రెండు క్వాష్ పిటిషన్లు వేశారు. భీమవరం, పోడూరు స్టేషన్లలో తనపై నమోదైన కేసులపై శుక్రవారం హైకోర్టులో వేర్వేరుగా రఘురామ కృష్ణరాజు క్వాష్ పిటిషన్లు దాఖలు చేశారు. ఆ కేసులకు సంబంధించి ఎలాంటి చర్యలు తీసుకోకుండా ఆదేశాలు ఇవ్వాలని పిటిషన్లలో పేర్కొన్నారు. క్వాష్ పిటిషన్లపై విచారణను న్యాయస్థానం వాయిదా వేసింది.













