అమరావతికి జై కొట్టిన వైసీపీ ఎంపి…
అమరవాతి ఉద్యమం 200వ రోజుకు చేరుకున్న సమయంలో..రాజధాని వికేంద్రీకరణ విషయంలో ఆంధ్రప్రదేశ్‌లోని విపక్షాలకు అధికార పక్షం నుంచే మద్ధతు లభించడం విశేషం. గత కొంత కాలంగా ఆంధ్ర ప్రదేశ్‌లోని వైసీపీ ప్రభుత్వానికి, వైఎస్ జగన్‌కు కంట్లో నలుసులా మారిన నర్సాపురం ఎంపీ మరోసారి తన ధిక్కార స్వరాన్ని వినిపించారు. ఈ సారి ఏకంగా వైసీపీ ప్రతిష్టాత్మకంగా తీసుకున్న రాజధాని వ్యవహారంపైనే ఆయన వ్యాఖ్యలు చేయడం సంచలనంగా మారింది.
అమరావతినే రాజధానిగా కొనసాగించాలని రఘురామకృష్ణంరాజు అభిప్రాయపడ్డారు. ఒకవేళ వికేంద్రీకరణనే కోరుకుంటే అమరావతిని ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ చేయాలని డిమాండ్ చేశారు. గతంలో ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు కూడా ఇలాగే కోరారని చెప్పారు. తమ రాజధాని కొనసాగించాలంటున్న అమరావతి ప్రాంత వాసులది న్యాయబద్ధమైన కోరిక అన్నారాయన. రాజధానిని 3 ప్రాంతాల్లో ఏర్పాటు చేయాలనేది ప్రభుత్వ నిర్ణయమే తప్ప అధికార పార్టీ నిర్ణయం కాదంటూ విచిత్రమైన మెలిక పెట్టారు. తమ ఎంపీపై అనర్హత వేటు వేయాలని ఓ వైపు లోక్ సభ స్పీకర్‌కు వైసీపీ అధికారికంగా వినతిపత్రం ఇచ్చిన నేపధ్యంలో తాడో పేడో తేల్చుకోవడానికే రఘరామకృష్ణంరాజు కూడా సిద్ధమయ్యారని పరిశీలకులు భావిస్తున్నారు.













