Jagan: ఏపీ బడ్జెట్ సమావేశాల మొదటి రోజు: వైసీపీ రోల్ హైలైట్..
ఏపీ అసెంబ్లీ బడ్జెట్ (AP Budget) సమావేశాలు ఈ నెల 11 నుంచి ప్రారంభం కావడం రాజకీయ వర్గాల్లో ఆసక్తిని పెంచింది. సాధారణంగా బడ్జెట్ సమావేశాలు అనగానే ప్రభుత్వం ప్రవేశపెట్టే ఆర్థిక ప్రణాళికలు, కొత్త నిర్ణయాలపై చర్చ జరుగుతుంది. కానీ ఈసారి ఆ అంశాలకన్నా ఎక్కువగా చర్చకు వస్తున్నది ప్రతిపక్ష వైసీపీ (YCP ) ఎమ్మెల్యేలు సభకు హాజరవుతారా లేదా అన్నదే. ఈ అంశం ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది.
2024 ఎన్నికల తర్వాత వైసీపీ శాసనసభ్యులు చాలా పరిమితంగా మాత్రమే సభలో కనిపించారు. పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి (Y.S. Jagan Mohan Reddy) నేతృత్వంలోని 11 మంది ఎమ్మెల్యేలు ఇప్పటివరకు కేవలం రెండు సందర్భాల్లో మాత్రమే అసెంబ్లీకి హాజరయ్యారు. ఎన్నికల్లో గెలిచిన తర్వాత ప్రమాణ స్వీకారానికి ఒకసారి, అలాగే 2025–26 బడ్జెట్ సమావేశాల ప్రారంభంలో గవర్నర్ ప్రసంగం రోజున మరోసారి సభలో కనిపించారు.
ఆ రోజు జరిగిన పరిణామాలు పెద్ద దుమారం రేపాయి. పార్టీ నేతలపై జరుగుతున్న దాడులను నిరసిస్తూ జగన్ నల్ల కండువా ధరించి రావడం తీవ్ర చర్చకు దారితీసింది. సభలోనే పోలీసు అధికారిపై వ్యాఖ్యలు చేయడం వివాదాస్పదంగా మారింది. ఆ తర్వాత జరిగిన పలు సమావేశాలకు వైసీపీ సభ్యులు దూరంగా ఉండటంతో, అసెంబ్లీలో వారి గైర్హాజరు ప్రశ్నార్థకంగా మారింది.
ఇప్పుడు మళ్లీ 2026–27 వార్షిక బడ్జెట్‌ను ప్రవేశపెట్టే సమయం రావడంతో, వైసీపీ వైఖరిపై ఉత్కంఠ నెలకొంది. ప్రభుత్వం మాత్రమే కాకుండా అసెంబ్లీ వర్గాల నుంచి కూడా సభ్యులు హాజరుకావాలన్న సూచనలు వచ్చాయి. స్పీకర్ అయ్యన్న పాత్రుడు (Ayyanna Patrudu) అన్ని పార్టీల ఎమ్మెల్యేలకు అధికారిక ఆహ్వానాలు పంపినట్టే, వైసీపీ సభ్యులకు కూడా నోటీసులు అందాయి.
ఈ సమావేశాలు 11వ తేదీ నుంచి ప్రారంభం కావడం మరో ఆసక్తికర అంశంగా మారింది. ఎందుకంటే వైసీపీకి ప్రస్తుతం 11 మంది ఎమ్మెల్యేలు మాత్రమే ఉన్నారు. ఈ సంఖ్య, తేదీ కలిసిరావడంతో రాజకీయంగా చర్చ మొదలైంది. ఇప్పటికే మహిళా మంత్రి సంధ్యారాణి (Sandhya Rani) బహిరంగంగానే సవాల్ విసిరి, టీమ్ 11 సభకు రావాలని వ్యాఖ్యానించారు.
ఈ నేపథ్యలో జగన్ తీసుకునే నిర్ణయం ఏమిటన్నది కొద్దిరోజులుగా చర్చనీయాంశంగా కొనసాగింది. దీనికి తాజాగా స్పష్టత వచ్చింది. పార్టీ కార్యాలయం నుంచి ఎమ్మెల్యేలకు కీలక ఆదేశాలు వెళ్లినట్టు సమాచారం. బడ్జెట్ సమావేశాల తొలి రోజున తప్పనిసరిగా సభకు హాజరుకావాలని సూచించినట్లు తెలుస్తోంది. మొదటి రోజు గవర్నర్ ప్రసంగం ఉండటంతో, ఆ వేదికను ఉపయోగించుకుని ప్రభుత్వ విధానాలపై నిరసన తెలపాలని వైసీపీ భావిస్తున్నట్టు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. తిరుమల శ్రీవారి లడ్డూ వివాదం, అంబటి రాంబాబు (Ambati Rambabu) అరెస్టు వంటి అంశాలను సభలో ప్రస్తావించాలని నిర్ణయించినట్టు సమాచారం. మొత్తంగా చూస్తే, ఈ బడ్జెట్ సమావేశాల తొలి రోజున మాత్రం వైసీపీ ఎమ్మెల్యేలు అసెంబ్లీలో అడుగుపెట్టడం ఖాయమన్న సంకేతాలు కనిపిస్తున్నాయి. అయితే వైసీపీ అధినేత సభకు వస్తారా లేదా అన్న విషయం రేపు సభ ప్రారంభం అయ్యాకే తెలుస్తుంది..













