ఆ రెండు బాబుకి కలిసి రాలేదంటారా…?
ఆంధ్రప్రదేశ్ లో కీలకమైన మున్సిపల్ ప్రక్రియ ముగిసింది. మున్సిపల్ ఎన్నికల్లో ఎవరు గెలుస్తారు ఏంటనే దానిపై ఎన్నో లెక్కలు వేసుకున్నా చివరికి వైసీపీ విజయం సాధించింది. తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ఒక్క విశాఖలో అయినా గెలుస్తామని చాలా వరకు ఆశలు పెట్టుకుని ముందుకు వెళ్లారు. కానీ అలాంటి పరిస్థితి కనబడలేదు. విశాఖలో కూడా ఆ పార్టీని ప్రజలు పెద్దగా ఆదరించిన పరిస్థితి లేదు అని చెప్పాలి. అయితే రాజకీయంగా ఇపుడున్న పరిస్థితుల నేపథ్యంలో చంద్రబాబు నాయుడు కొన్ని కొన్ని విషయాల్లో చాలా వరకు జాగ్రత్తగా వెళ్లాల్సిన అవసరం ఉందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
విశాఖలో తెలుగుదేశం పార్టీ ఇప్పుడు విశాఖ ఉక్కు పరిశ్రమ ఉద్యమాన్ని భుజాన వేసుకుని ముందుకు నడిపిస్తున్నది. తెలుగుదేశం పార్టీ నేతలు అందరూ కూడా రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలను తీవ్రస్థాయిలో విమర్శిస్తున్నారు. కానీ కార్పొరేషన్ ఎన్నికల్లో మాత్రం తెలుగుదేశం పార్టీ విజయం సాధించలేకపోయింది. దీంతో అసలు విశాఖ ఉక్కు పరిశ్రమ గురించి అక్కడి ప్రజల్లో ఉద్యమం నడిపి ఆలోచన ఉందా లేదా అనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. విశాఖ ఉక్కు పరిశ్రమకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం ప్రకటన చేసిన తర్వాత ముఖ్యమంత్రి జగన్ పై విశాఖ ప్రజలు తీవ్ర స్థాయిలో విమర్శలు చేసారు.
సోషల్ మీడియాలో ఎలక్ట్రానిక్ మీడియాలో నేతలు ఆరోపణలు చేశారు. రోడ్లమీద నిరసనలు కూడా చేసిన పరిస్థితి మనం చూశాము. కానీ ఓటు వేసే విషయానికి వచ్చే సరికి తెలుగుదేశం పార్టీకి అక్కడి ప్రజలు షాక్ ఇచ్చారు. అమరావతి ఉద్యమ ప్రభావం కృష్ణా గుంటూరు జిల్లాల్లో ఎంతగానో ఉంటుందని భావించిన చంద్రబాబు నాయుడు వచ్చిన ఫలితాలు చూసి ఒక్క సారిగా విస్మయం వ్యక్తం చేశారు. గుంటూరు జిల్లాలో తెలుగుదేశం పార్టీ ఎక్కువ స్థానాల్లో గెలుస్తుంది అని భావించిన సరే కనీసం గుంటూరు కార్పొరేషన్ పరిధిలో కూడా తెలుగుదేశం పార్టీ విజయం సాధించలేకపోయింది.
విజయవాడలో కూడా బలమైన నాయకత్వం ఉన్నాసరే విజయవాడలో కూడా పార్టీ విజయం సాధించలేకపోయింది అనే విషయం స్పష్టంగా అర్థమైంది. కృష్ణా జిల్లాలో ఏ ఒక్క మున్సిపాలిటీ కూడా తెలుగుదేశం పార్టీ గెలవలేదు. కనీసం చాలా స్థానాల్లో ప్రభావం చూపించలేకపోయింది. ఆ పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు విశాఖ ఉక్కు పరిశ్రమ ఉద్యమం అలాగే అమరావతి ఉద్యమం విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది అనే భావన వ్యక్తమవుతోంది. చంద్రబాబునాయుడు ఈ విషయాలను పక్కనపెట్టి ప్రజల్లోకి వెళ్లి పోరాటాలు చేసే అంశం గురించి ఆలోచిస్తే మంచిది అనే అభిప్రాయాన్ని కొంతమంది వ్యక్తం చేస్తున్నారు.













