అడ్రస్ మారింది కానీ డ్రెస్ మారలేదు
ఉపరాష్ట్రపతిగా వెంకయ్యనాయుడి పదవి మారింది కాని డ్రెస్ మాత్రం ఏం మారలేదని గవర్నర్ నరసింహన్ అన్నారు. అమరావతిలోని వెలగపూడి సచివాలయంలో ప్రభుత్వం తరపున వెంకయ్యకు ఘనసన్మానం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న గవర్నర్ మాట్లాడుతూ తన రాజకీయ జీవితం ప్రారంభమైనప్పటి నుంచి ఆయన ఒకే డ్రెస్ కోడ్ పాటిస్తున్నారని, సాధారణంగా ఏ రాజకీయ నాయకుడైన తన స్థాయి పెరిగేకొద్దీ తత్వం కూడా మార్చుకుంటారన్నారు. కానీ వెంకయ్య 40 ఏళ్లుగా అలాగే ఉండటం ఆయన గొప్పతనమని కొనియాడారు. వెంకయ్యనాయుడుది సుదీర్ఘ రాజకీయ ప్రస్థానమని అన్నారు. ర్యాలీలో వెంకయ్యకు ప్రజలు బ్రహ్మరథం పట్టారని చెప్పుకొచ్చారు. ఎన్నో గొప్ప గుణాలు కలిగిన వ్యక్తి వెంకయ్యనాయుడని కొనియాడారు. క్రమశిక్షణకు మారుపేరు వెంకయ్యనాయుడని వెల్లడించారు. రాష్ట్ర విభజన సమయంలో వెంకయ్యనాయుడు చేసిన కృషి ఎనలేనిదని కొనియాడారు.













