Vallabhaneni Vamsi: అర్ధరాత్రి హైడ్రామా.. ఎట్టకేలకు వంశీకి రిమాండ్..!!
గన్నవరం (Gannavaram) మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నేత వల్లభనేని వంశీకి (Vallabhaneni Vamsi) కోర్టు అర్ధరాత్రి రిమాండ్ (remand) విధించింది. హైదరాబాద్ లో గురువారం ఉదయం వంశీని అదుపులోకి తీసుకున్న పోలీసులు విజయవాడ (Vijayawada) తరలించి సుదీర్ఘంగా విచారించారు. అనంతరం అర్ధరాత్రి మెజిస్ట్రేట్ (mejistrate) ముందు హాజరు పరిచారు. సుదీర్ఘ వాదనలు విన్న అనంతరం మెజిస్ట్రేట్ వల్లభనేని వంశీకి 14 రోజుల రిమాండ్ విధించారు. రిమాండ్ రిపోర్టులో పోలీసులు పలు కీలక అంశాలను పేర్కొన్నారు. రిమాండ్ అనంతరం వంశీని విజయవాడ జిల్లా జైలుకు తరలించారు.
గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి (gannavaram tdp office attack) కేసులో వల్లభనేని వంశీ ఎట్టకేలకు అరెస్ట్ అయ్యారు. వైసీపీ (YCP) అధికారంలో ఉన్నప్పుడు గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి జరిగింది. ఈ కేసులో వంశీ ఏ71గా ఉన్నారు. అయితే ఇటీవల ఈ కేసు ఫిర్యాదుదారుడు ఈ కేసుతో తనకు ఎలాంటి సంబంధం లేదంటూ ఎస్సీ, ఎస్టీ కేసులో అఫిడవిట్ దాఖలు చేశారు. దీంతో ఏం జరిగిందో ఆరా తీసేందుకు పోలీసులు ప్రయత్నించారు. చివరకు పిర్యాదుదారుడు సత్యవర్ధన్ (Sathyavardhan) ను వంశీతో పాటు అతని అనుచరులు కిడ్నాప్ (kidnap) చేసి బెదిరించినట్లు సాక్ష్యాధారాలు లభించాయి. అంతేకాక సత్యవర్ధన్ సోదరుడు కిడ్నాప్ పై పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు వల్లభనేని వంశీని అదుపులోకి తీసుకున్నారు.
హైదరాబాద్ నుంచి విజయవాడ తరలించిన అనంతరం కృష్ణలంక పోలీస్ స్టేషన్ (Krishna Lanka Police Station) లో వల్లభనేని వంశీని పోలీసులు సుదీర్ఘంగా విచారించారు. వంశీ ఫోన్ పై ఆరా తీసారు. అయితే అది దొరకనట్లు తేలింది. వంశీతోపాటు మరో ఇద్దరిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ జరిపారు. అనంతరం రిమాండ్ రిపోర్ట్ సిద్ధం చేశారు. ఇందులో పలు కీలక అంశాలను పేర్కొన్నారు. సత్యవర్ధన్ ను చంపేందుకు కిడ్నాప్ చేశారు. ఒక రాత్రంతా చిత్రహింసలు పెట్టి బెదిరించారు. చివరకు కేసు విత్ డ్రా చేసుకుంటున్నట్టు సంతకాలు చేయించుకుని కోర్టుకు తీసుకెళ్లి వాంగ్మూలం ఇప్పించారు. వాంగ్మూలానికి కట్టుబడి ఉండకపోతే కుటుంబసభ్యులను చంపేస్తామని బెదిరించారు.
విజయవాడ ఆయుష్ ఆసుపత్రి వద్ద సత్యవర్ధన్ ను కారు ఎక్కించుకున్న వంశీ అనుచరులు అతడిని బెదిరించి హనుమాన్ జంక్షన్ తీసుకెళ్లారు. అక్కడ వాంగ్మూల పత్రాలపై సంతకాలు చేయించుకున్నారు. మరుసటిరోజు వంశీ అనుచరులు విజయవాడ కోర్టుకు తీసుకెళ్లి సత్యవర్ధన్ తో అఫిడవిట్ దాఖలు చేయించారు. ఆ తర్వాత 10,11 తేదీల్లో సత్యవర్ధన్ ను హైదరాబాద్ తీసుకెళ్లి వంశీతో మాట్లాడించారు. మైహోం భూజాలోనే ఆ రాత్రంతా చిత్రహింసలు పెట్టారు. అనంతరం ఏ9, ఏ10, ఏ12 సత్యవర్ధన్ ను తీసుకెళ్లి విశాఖపట్నంలోని ఓ ఫ్లాట్ లో ఉంచారు.
సత్యవర్ధన్ అపహరణతో పాటు చిత్రహింసలకు సంబంధించిన సాక్ష్యాధారాలను పోలీసులు సేకరించినట్లు సమాచారం. దీంతో పక్కా ఆధారాలతో వంశీని అదుపులోకి తీసుకున్నారు. విచారణ, వైద్యపరీక్షల అనంతరం వంశీతో పాటు అతని అనచరులు వెంకట శివరామ కృష్ణప్రసాద్, లక్ష్మీపతిని న్యాయస్థానంలో హాజరు పరిచారు. ఇరుపక్షాల వాదనలు విన్న అనంతరం 14 రోజులపాటు రిమాండ్ విధించారు మెజిస్ట్రేట్. అయితే వంశీ బెయిల్ కోసం ఇవాళ పిటిషన్ దాఖలు చేయనున్నట్టు సమాచారం.













