తిరుపతిలో వైకుంఠమాల
ప్రణాళికా బద్ధమైన పచ్చదనంతో నగరాలను అందంగా, ఆకర్షణీయంగా తీర్చిదిద్దాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు. అమరావతిలో బౌద్ధమాల, తిరుపతిలో వైకుంఠమాల, విశాఖలో సౌందర్యమాల పేర్లతో పచ్చదనాన్ని కారిడార్లుగా అభివృద్ధి చేయనున్నట్లు ప్రకటించారు. రాష్ట్రంలో ఎన్టీఆర్ పీఎంఏవై గృహ నిర్మాణాలు, ‘పచ్చదనంతో పట్టణాలు, నగరాల సుందరీకరణ‘ అంశాలపై బుధవారం సాయంత్రం ఆయన సచివాలయంలో సమీక్షించారు.
ఈ నగరాల్లో జాతీయ రహదారులు, బాహ్యవలయ రహదారులు, నగరాలను కలిపే ప్రధాన రహదారుల చుట్టూ పచ్చదనం నింపి ఆకుపచ్చ హారంలా తీర్చిదిద్దాలని కోరారు. బౌద్ధమాల, వైకుంఠమాల, సౌందర్యమాలను కారిడార్ల తరహాలో అభివృద్ధి చేసి నవ్యాంధ్ర పచ్చదనంతో కొత్తశోభను సంతరించుకునేందుకు కృషి చేయాలన్నారు. వచ్చే మార్చిలోగా రాష్ట్రంలోని 71 పురపాలక సంఘాల పరిధిలోని కాలనీల్లో 100 పార్కులను అభివృద్ధి చేయాలని చంద్రబాబు ఆదేశించారు.













