తిరుమలలో శ్రీవారి వైకుంఠద్వార దర్శనం
తిరుమల తిరుపతి దేవస్థానం చరిత్రలోనే మొట్టమొదటి సారిగా పదిరోజుల పాటు భక్తులకు వైకుంఠ ద్వార దర్శనం కల్పించేందుకు ఏర్పాట్లు పూర్తి చేసింది. టీటీడీ ఇప్పటి వరకు వైకుంఠ ఏకాదశి, ద్వాదశి పర్వదినాలకు మాత్రమే పరిమితం అయిన స్వామివారి వైకుంఠ ద్వార దర్శనానికి ఇకపై వైకుంఠ ఏకాదశి పర్వదినం నుంచి శ్రీరంగం తరహాలో పదిరోజుల పాటు తెరిచేందుకు టీటీడీ ఆగమ పండితులు, శ్రీవారి ఆలయ జీయంగార్లు అంగీకరించడంతో పాటు శ్రీవారి ఆలయంతో సంబంధం ఉన్న 26 మంది మఠాధిపతులు, పీఠాధిపతులు కూడా ఎక్కువ సంఖ్యలో భక్తులకు వైకుంఠ ద్వార దర్శనం భాగ్యం కల్పించేందుకు టిటిడి తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతించారు. మరోవైపు టీటీడీ నిర్ణయం పట్ల భక్తుల నుంచి విశేష స్పందన లభిస్తోంది. ఆన్లైన్లో వైకుంఠ ద్వార దర్శనం టికెట్లను విడుదల చేసిన 10 గంటల సమయంలోపే 2 లక్షల టికెట్లు కొనుగోలు చేసేశారు. ఇక సర్వదర్శనంకు సంబంధించి ఆఫ్లైన్లో నేటి నుంచి లక్ష టికెట్లను తిరుపతి వాసులకు కేటాయించింది.
ఏడాదికి రెండురోజుల పాటు మాత్రమే ఆలయంలో తెరిచి ఉంటే వైకుంఠ ద్వార దర్శనం కోసం అటు సామాన్యులే కాదు ఇటు విఐపిలు కూడా పెద్ద సంఖ్యలో తిరుమలకు చేరుకుంటారు. ఇల వైకుంఠంలో వెలసిన స్వామివారి వైకుంఠ ద్వార దర్శనం చేసుకుంటే మోక్షం సిద్ధిస్తుందన్నది భక్తుల ప్రగాడ విశ్వాసం. దీంతో ఏడాదికి రెండు రోజుల పాటు మాత్రమే ధనుర్మాస నెలలో వైకుంఠ ఏకాదశి, ద్వాదరి పర్వదినాలలో మాత్రమే భక్తులకు వైకుంఠ ద్వార దర్శనం లభిస్తుంది. వేంకటాచల మహత్యంలో పేర్కొన్న విధంగా దేవతలకు ఉత్తరాయణంలో వచ్చే ఆరునెలలు పగలు అయితే దక్షిణాయణంలో వచ్చే ఆరు నెలలు రాత్రిగా పేర్కొంటారు. ఇక దక్షిణాయణంలో చివరి నెల అయిన ధనుర్మాస నెల దేవతల నెలగా భావిస్తారు.
దేవతలకు ఈనెల బ్రహ్మముహూర్తమట. అందుకు అనుగుణంగానే పండుగ నెలను ధర్మాస నెలగా భావించి నెల మొత్తం ఆలయ సందర్శనం చేస్తూ ఉంటారు భక్తులు. ఇక మహావిష్ణువుకు తిథులలో ఏకాదశి, ద్వాదశి అతి ముఖ్యమైనదిగా భావిస్తారు. దీంతో ధనుర్మాస నెలలో వచ్చే ఏకాదశి, ద్వాదశి పర్వదినాలలో దేవతల ద్వారంగా పేర్కొనే ఉత్తర ద్వారాన్ని వైష్ణవ ఆలయాలలో తెరిచి ఉంచుతారు. ఆ రోజున స్వామివారు ప్రత్యేకంగా ఉత్తరద్వారం ద్వారా వెలుపలికి వచ్చి మాడవీధుల్లో ఊరేగుతూ భక్తులకు దర్శనమిస్తారు. శ్రీవారి ఆలయానికి సంబంధించి ప్రత్యేకంగా ఉత్తర ద్వారం లేదు. స్వామివారి ఆనందనిలయంలోనే రెండు ప్రాకారాలు ఉన్నాయి. స్వామివారి గర్భాలయాన్ని ఆనుకుని ఉన్న ప్రాకారం ఒకటైతే మరో ఆరడుగుల దూరంలో ఉన్న ఆనందనిలయ గోపుర ప్రాకారం మరొకటి. దీంతో వైకుంఠ ఏకాదశి, ద్వాదశి పర్వదినాన శ్రీవారి భక్తులను ఈ వైకుంఠ ద్వారంలో అనుమతిస్తుంది. దీంతో వైకుంఠ ద్వార ప్రవేశంతో పాటు స్వామివారి గర్భాలయ ప్రాకారాన్ని స్పృశించే భాగ్యం భక్తులకు కలుగుతుంది.













