18 ఏళ్లు నిండిన వారందరికీ ఉచితంగా వ్యాక్సిన్ : సీఎం జగన్

వ్యాక్సినేషన్ విషయంలో ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. 18 ఏళ్లు పైబడిన వారందరికీ ఉచితంగా వ్యాక్సిన్‌ను అందిస్తామని ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రకటించారు. మే 1 నుంచి దేశవ్యాప్తంగా 18 ఏళ్లు పైబడిన వారికి వ్యాక్సిన్ ఇస్తున్నట్లు కేంద్రం ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఏపీ సీఎం జగన్ కూడా ఈ నిర్ణయం తీసుకున్నారు. ప్రభుత్వం ఖర్చుతోనే 18 ఏళ్లు నిండిన వారందరికీ ఉచితంగా వ్యాక్సిన్ ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రంలో కోవిడ్ విజృంభణ నేపథ్యంలో మంత్రులు, ఉన్నతాధికారులతో సీఎం జగన్ సమీక్ష నిర్వహించారు.
ఈ సమీక్ష సందర్భంగానే జగన్ పై నిర్ణయం తీసుకున్నారు. అయితే 18 నుంచి 45 ఏళ్ల వయస్సున్న వారు 2,04,70,364 మంది ఉన్నట్లు తాము గుర్తించామని మంత్రి ఆళ్లనాని తెలిపారు. ఉచిత వ్యాక్సిన్ కోసం 1600 కోట్లు ఖర్చవుతాయని నాని పేర్కొన్నారు. మరోవైపు రాష్ట్రంలో వ్యాక్సిన్ కొరత రాకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు. సీఎం జగన్ స్వయంగా భారత్ బయోటెక్ ఎండీ, హెటెరో డ్రగ్స్ ఎండీకి ఫోన్ చేశారు. రాష్ట్ర అవసరాలు తీర్చే విధంగా మరిన్ని కోవిడ్ వ్యాక్సిన్ డోస్‌లతో పాటు, రెమిడేసివిర్ ఇంజక్షన్లను సరఫరా చేయాలని ఆ ఇద్దర్నీ సీఎం జగన్ కోరారు.