వ్యాక్సినేషన్ ఉధృతం చేయండి : సీఎం జగన్ సూచన
వ్యాక్సినేషన్ ప్రక్రియను ఉధృతం చేయాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అధికారులను ఆదేశించారు. ప్రజల ఆరోగ్యాన్ని కాపాడే వ్యాక్సిన్ యజ్ఞం ముమ్మరంగా కొనసాగాలని సూచించారు. వీలైనంత తొందరగా ‘విలేజ్ డాక్టర్స్’ పద్ధతిని అమలులోకి తీసుకురావాలని, వ్యాక్సినేషన్ ప్రక్రియ గ్రామాల్లో పూర్తిస్థాయిలో కొనసాగాలని జగన్ సూచించారు.కోవిడ్ 19 వ్యాక్సినేషన్ ప్రక్రియపై సీఎం జగన్ బుధవారం క్యాంప్ కార్యాలయంలో సమీక్ష సమావేశం నిర్వహించారు. వ్యాక్సినేషన్ ప్రక్రియ విషయంలో ప్రజల్లో మరింత చైతన్యాన్ని తీసుకురావాలని, మరింత ప్రచారం చేయాలని అన్నారు. నాలుగు వారాల్లోగా కోటి మందికి వ్యాక్సిన్ ఇవ్వాలని సీఎం నిర్ణయించారు. ఎన్నికలు పూర్తైనందున సోమవారం నుంచి అర్బన్ ప్రాంతాల్లో ఈ వ్యాక్సినేషన్ ప్రక్రియను ప్రారంభించాలని కోరారు. రూరల్ ప్రాంతాల్లో పైలట్ ప్రాజెక్టుగా వారంలో నాలుగు రోజులు, రోజుకు రెండు గ్రామాల చొప్పున వ్యాక్సినేషన్ ఇవ్వాలని సీఎం జగన్ సూచించారు.













