బెజవాడ మేయర్ పీఠం.. ఒకటే సీటు, భారీగా పోటీ..!
రాబోయే మున్సిపల్ ఎన్నికల ముందే విజయవాడ(Vijayawada) మేయర్ సీటుకు సంబంధించిన రాజకీయాలు తెలుగుదేశం పార్టీ అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి(Chandrababu Naidu) పెద్ద తలనొప్పిగా మారాయి. బెజవాడ మున్సిపల్ కార్పొరేషన్‌ను కైవసం చేసుకోవడమే కాకుండా, అక్కడ మేయర్ కుర్చీపై తమ వారసులను కూర్చోబెట్టాలని కూటమిలోని పలువురు బలమైన నేతలు గట్టి పట్టుదలతో ఉన్నారు. రోజురోజుకూ ఆశావహుల సంఖ్య పెరుగుతుండటంతో అభ్యర్థి ఎంపిక చంద్రబాబుకు కత్తిమీద సాములా మారింది.
ప్రస్తుతం విజయవాడ పొలిటికల్ సర్కిల్స్‌లో మేయర్ పదవి కోసం బొండా ఉమామహేశ్వరరావు కుమారుడు సిద్ధార్థ్ పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. తండ్రి అండతో నగరంలో పట్టు పెంచుకుంటూ, యువతను సమన్వయం చేసుకుంటూ ఎలాగైనా మేయర్ కుర్చీని దక్కించుకోవాలని బొండా సిద్ధార్థ్ ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారు. మరోవైపు ఉమ్మడి కృష్ణా జిల్లా రాజకీయాల్లో దశాబ్దాల చరిత్ర ఉన్న దేవినేని కుటుంబ వారసత్వాన్ని చాటాలని దేవినేని చందు కూడా గట్టిగా గ్రౌండ్ వర్క్ చేసుకుంటున్నారు.
నగరంలో బలమైన ఫాలోయింగ్ ఉన్న వంగవీటి రాధా కూడా ఈ రేసులో అత్యంత కీలకంగా మారే అవకాశం ఉందనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఇలా ఇప్పటికే ముగ్గురు ఉద్ధండులు సీటు కోసం కాచుకుని కూర్చుండగా, మాజీ ఎమ్మెల్యే జలీల్‌ఖాన్ ఎంట్రీ ఇవ్వడంతో సమీకరణాలు ఒక్కసారిగా మారిపోయాయి. విజయవాడ మేయర్ పీఠాన్ని ఈ సారి ఖచ్చితంగా ముస్లింలకే కేటాయించాలని, ఒకవేళ మహిళా రిజర్వేషన్ వస్తే గనుక తన కుమార్తెకు ఆ అవకాశం ఇవ్వాలని జలీల్‌ఖాన్ డిమాండ్ చేయడం పార్టీ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. సామాజిక సమీకరణాలు, పార్టీలోని సీనియర్ల డిమాండ్లు, మరియు యువ నేతల ఆకాంక్షల మధ్య సమతుల్యతను కాపాడుకుంటూ చంద్రబాబు ఈ సమస్యను ఎలా పరిష్కరిస్తారో చూడాలి మరి.








