తెనాలి వేదికగా నంది నాటకోత్సవాలు: మంత్రి కందుల దుర్గేష్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సంస్కృతి, నాటక రంగానికి పూర్వవైభవం తెచ్చేలా కూటమి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర పర్యాటక, సినిమాటోగ్రఫీ మరియు సాంస్కృతిక శాఖ మంత్రి కందుల దుర్గేష్ నంది నాటకోత్సవాల నిర్వహణపై అధికారిక ప్రకటన చేశారు. రాబోయే రెండు రోజుల్లోనే ఈ నంది నాటకోత్సవాలకు సంబంధించిన అధికారిక నోటిఫికేషన్ను ప్రభుత్వం విడుదల చేయబోతోందని ఆయన స్పష్టం చేశారు. కళల కాణాచిగా పేరుగాంచిన గుంటూరు జిల్లా తెనాలి వేదికగా వచ్చే ఏడాది జనవరి నెలలో ఈ నంది నాటకోత్సవాలను అత్యంత వైభవంగా నిర్వహించనున్నారు.
ఈ ఉత్సవాల్లో ఆంధ్రప్రదేశ్లోని అన్ని ప్రాంతాలకు ప్రాతినిధ్యం ఉండేలా మొత్తం 28 జిల్లాల పరిధిలోని కళాకారులకు ప్రత్యేక ప్రోత్సాహకాలను అందించనున్నారు. తెలుగు నాటక రంగాన్ని ప్రోత్సహించడంతో పాటు, ఇతర రాష్ట్రాలకు చెందిన తెలుగు నాటక సమాజాలకు కూడా ఈ ఉత్సవాల్లో ప్రదర్శనలు ఇచ్చేందుకు ప్రభుత్వం అవకాశం కల్పిస్తోంది. నాటకోత్సవాల నిర్వహణకు సంబంధించి పక్కా టైంలైన్ను మంత్రి కందుల దుర్గేష్ వెల్లడించారు. దీని ప్రకారం అక్టోబర్ నెలలో నాటకాలను పరిశీలించి స్క్రీనింగ్ చేయడానికి ప్రత్యేక ఎంపిక కమిటీని ఏర్పాటు చేస్తారు.
అనంతరం డిసెంబర్ నెలలో ఉత్సవాలలో ప్రదర్శించబోయే తుది నాటక బృందాల ఎంపిక ప్రక్రియను పూర్తి చేసి, జనవరిలో జరిగే ముగింపు వేడుకలలో భాగంగా ప్రతిష్టాత్మక ‘కందుకూరి వీరేశలింగం పురస్కారాలను’ రంగస్థల కళాకారులకు ప్రదానం చేయనున్నారు. నాటకాలతో పాటు సినీ రంగ ప్రముఖులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ‘నంది సినీ అవార్డుల’ (Film Awards) పై కూడా త్వరలోనే అధికారిక ప్రకటన చేస్తామని మంత్రి దుర్గేష్ తీపి కబురు చెప్పారు. చలనచిత్ర అవార్డుల ఎంపిక ప్రక్రియ అత్యంత పారదర్శకంగా జరిగేలా ఒక ప్రత్యేక జ్యూరీని ఏర్పాటు చేయబోతున్నట్లు పేర్కొన్నారు. గత కొన్నేళ్లుగా నిలిచిపోయిన నంది అవార్డులను పునరుద్ధరించడం ద్వారా కళాకారులకు, సినీ రంగానికి ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.








