ఎమ్మెల్సీ ఎన్నికల భారమంతా మంత్రులపైనే..!?
వచ్చే ఏడాది మార్చిలో జరగనున్న రెండు పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు తెలంగాణ రాజకీయాల్లో తీవ్ర ఉత్కంఠను రేపుతున్నాయి. ముఖ్యంగా రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వానికి ఇవి అగ్నిపరీక్షగా మారాయి. కర్నాటకలో జరిగిన 4 ఎమ్మెల్సీ ఎన్నికల్లో అధికార కాంగ్రెస్ పార్టీ ఓడిపోయింది. ఆ పరిస్థితి తెలంగాణలో రాకుండా చూసుకోవాలనే పట్టుదలతో ఉన్నారు సీఎం రేవంత్ రెడ్డి. అందుకే ఎమ్మెల్సీ ఎన్నికల గెలుపు బాధ్యతను మంత్రులకు అప్పగించారు.
రేవంత్ రెడ్డి కేబినెట్ లోని మంత్రుల్లో ఉమ్మడి నల్గొండ, ఖమ్మం, వరంగల్ అలాగే హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్ నగర్ పట్టభద్రుల నియోజకవర్గాల పరిధిలోని వారే ఎక్కువగా ఉన్నారు. గడ్డం వివేక్ మినహా మంత్రులందరూ ఈ రెండు నియోజకవర్గాల్లో ఏదో ఒక రూపంలోబాధ్యతలు నిర్వహిస్తున్నారు. కొందరు ఎమ్మెల్యేలుగా ఉంటే, మరికొందరు జిల్లా ఇన్ ఛార్జ్ మంత్రులుగా ఉన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా ఉమ్మడి మహబూబ్ నగర్ స్థానం పరిధిలోని శాసనసభ్యుడిగా ఉండటంతో పాటు, ఆయా జిల్లాల బాధ్యతలను భుజాన వేసుకున్నారు.
మొత్తం 15 మందితో కూడిన రాష్ట్ర మంత్రిమండలిలో ఇద్దరు ముఖ్య నేతలు మినహా దాదాపు అందరూ ఈ రెండు స్థానాల ఫలితాలతో ప్రత్యక్షంగా ముడిపడి ఉన్నారు. నల్గొండ- ఖమ్మం- వరంగల్ స్థానం నుంచి సర్వోత్తమమ్ రెడ్డిని, హైదరాబాద్- రంగారెడ్డి- మహబూబ్ నగర్ స్థానం నుంచి సామా రామ్మోహన్ రెడ్డిని కాంగ్రెస్ అధిష్టానం బరిలోకి దింపింది. ఈ రెండు స్థానాల్లోనూ పార్టీ అభ్యర్ధులను గెలిపించుకోవాల్సిన బాధ్యత డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతో పాటు మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, సీతక్క, జూపల్లి కృష్ణారావు, వాకిటి శ్రీహరి, అజారుద్దీన్, పొన్నం ప్రభాకర్, దుద్దిళ్ల శ్రీధర్ బాబు, దామోదర రాజనర్సింహ తదితరులందరిపై ఉంది.
గత అసెంబ్లీ ఎన్నికల్లో ఉమ్మడి నల్గొండ, ఖమ్మం, వరంగల్ పరిధిలో కాంగ్రెస్ పార్టీ అఖండ మెజార్టీ సాధించింది. అక్కడ ప్రాతినిధ్యం వహిస్తున్న ఎమ్మెల్యేల్లో ఎక్కువమంది కాంగ్రెస్ వారే ఉన్నారు. బీఆర్ఎస్ నుంచి గెలిచిన కొంతమంది నేతలు కూడా కాంగ్రెస్ వైపు మొగ్గు చూపారు. అయితే పట్టభద్రుల నియోజకవర్గాల ఓటర్ల నాడి వేరుగా ఉంటుంది. చైతన్యవంతమైన మేధావులు, ఉద్యోగులు, నిరుద్యోగులు ఉండే ఈ స్థానాల్లో కేవలం సాధారణ రాజకీయ సమీకరణాలు పనిచేయవు. ప్రభుత్వ విధానాలపై ఉండే వ్యతిరేకత లేదా సానుకూలత నేరుగా ప్రభావం చూపుతుంది.
మరోవైపు హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్ నగర్ పట్టభద్రుల స్థానం చరిత్ర పూర్తిగా భిన్నమైనది. శాసనమండలి ఏర్పాటైన నాటి నుంచి ఈ స్థానాన్ని కాంగ్రెస్ ఇప్పటివరకు ఎప్పుడూ గెలుచుకోలేకపోయింది. గతంలో ఇతరుల మద్దతుతో ప్రొఫెసర్ నాగేశ్వర్, ఒకసారి బీజేపీ, మరోసారి బీఆర్ఎస్ పార్టీలు ఇక్కడ విజయం సాధించాయి. సీఎం రేవంత్ రెడ్డి సొంత నియోజకవర్గం కూడా ఇదే పరిధిలో ఉండటంతో ఈసారైనా ఆ సీటును కైవసం చేసుకుని చరిత్ర తిరగరాయాలని కాంగ్రెస్ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది.
ఈ ఎన్నికల్లో ప్రధాన ప్రతిపక్షమైన బీజేపీతో పాటు వామపక్ష భావజాలం ఉన్న పట్టభద్రులు, మైనారిటీ ఓటర్ల మద్దతు కూడగట్టుకుని గెలవాలనే పట్టుదలతో కాంగ్రెస్ నాయకత్వం ఉంది. మరోవైపు అధికార పార్టీని ఇరుకున పెట్టడానికి ప్రతిపక్షాలు కూడా ప్రణాళికలు రచిస్తున్నాయి. ఏది ఏమైనప్పటికీ, మంత్రులందరి రాజకీయ పటిష్టతకు, ప్రభుత్వ పాలనా తీరుకు ఈ ఎమ్మెల్సీ ఎన్నికలే అసలైన గీటురాయిగా నిలవనున్నాయి.








