ఏపీ విషయంలో కేంద్ర అసత్య ప్రచారం : సుజనాచౌదరి
ఆంధ్రప్రదేశ్ విషయంలో కేంద్రం అసత్య ప్రచారం చేస్తోందని కేంద్ర మాజీ మంత్రి, టీడీపీ రాజ్యసభ సభ్యుడు సుజనాచౌదరి ఆవేదన వ్యక్తం చేశారు. విభజన హామీలు, ప్రత్యేక హోదాపై రాజ్యసభలో సుజనా చర్చను ప్రారంభించిన ఆయన మోదీపై నిప్పులు చెరిగారు. కేంద్రం వైఖరి వల్ల ఆంధ్రప్రదేశ్ భవిష్యత్ అంధకారమయిందని ఆరోపించారు. రాజ్యసభలో మాజీ ప్రధాని ఇచ్చిన హామీలను కేంద్రం పట్టించుకోవడంలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఏపీ విషయంలో కేంద్రం సమాఖ్య స్ఫూర్తికి విరుద్ధంగా వ్యవహరిస్తోందని దుయ్యబట్టారు. మూకదాడుల తరహాలోనే ఏపీపై కేంద్రం వ్యవహరిస్తోందని ప్రజలు భావిస్తున్నారని చెప్పారు. విభజన చట్టాన్ని సవరించడంలో కూడా కేంద్రం నిర్లక్ష్యంగా వ్యవహరించిందని తెలిపారు. ఏపీకి పదేళ్ల పాటు ప్రత్యేక హోదా ఇస్తామని గుంటూరు, నెల్లూరు, తిరుపతి సభలో మోదీ చెప్పలేదా? అని ప్రశ్నించారు. మంత్రివర్గ నిర్ణయాలు రాజ్యంగబద్ధమైనవని చెప్పుకొచ్చారు. గత ప్రభుత్వ నిర్ణయాలను ఇప్పటి ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగానే అమలు చేయడంలేదని వాపోయారు. రూ.16వేల కోట్లతో రాష్ట్రం విడిపోయిందని అన్నారు. రెవెన్యూ లోటు రూ.4వేల కోట్లు అని పీఎంవోనే చెప్పిందని గుర్తు చేశారు. తామడుగుతున్నది కేవలం ఏపీకి రావాల్సింది మాత్రమే అడుగుతున్నామన్నారు. కానీ కేంద్రం మాత్రం ఏపీని అన్ని విధాలా అవమానించిందని వాపోయారు.













