వైకాపాలో చేరిన చలమలశెట్టి సునీల్
తూర్పుగోదావరి జిల్లాకు చెందిన తెలుగుదేశం పార్టీ నేత చలమలశెట్టి సునీల్ సొంతగూటికి చేరారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సమక్షంలో ఆయన వైకాపా తీర్థం పుచ్చుకున్నారు. సునీల్‌ను జగన్ సాదరంగా ఆహ్వానించి పార్టీ కండువా వేశారు. గతంలో చలమలశెట్టి సునీల్ రెండుసార్లు వైకాపా నుంచి కాకినాడ లోక్‌సభ అభ్యర్థిగా పోటీ చేసి ఓటమి పాలయ్యారు. 2019 ఎన్నికలకు ముందు ఆయన టీడీపీలో చేశారు. ఆ పార్టీ నుంచి సైతం మళ్లీ ఎంపీ అభ్యర్థిగానే బరిలో నిలిచినా విజయం దక్కలేదు. ప్రస్తుత రాజకీయ పరిణామాలతో తాజాగా ఆయన సొంతగూటికి రావాలని నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలో ముఖ్యమంత్రి జగన్ సమక్షంలో వైకాపాలో చేరారు.
ఈ కార్యక్రమంలో ఉపముఖ్యమంత్రి ధర్మాన కృష్ణదాస్, మంత్రులు కన్నబాబు, చెల్లుబోయిన వేణుగోపాల్ కృష్ణ, ఎంపీ వంగా గీతా, ఎమ్మెల్యేలు ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి, పెండెం దొరబాబు, దాడిశెట్టి రాజా, పర్వత పూర్ణచందప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.













