ఎంపీ రఘురామకృష్ణరాజుకు బెయిల్ మంజూరు చేసిన సుప్రీం కోర్టు

నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణరాజుకు సుప్రీం కోర్టు బెయిల్ మంజూరు చేసింది. షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. ఇరుపక్షాల వాదనలు విన్న ధర్మాసనం.. సుప్రీంలో బెయిల్ పిటిషన్ వేయడం సబబేనని వ్యాఖ్యానించింది. రఘురామపై మోపిన అభియోగాలు కస్టడిలోకి తీసుకొని ప్రశ్నించేటంత తీవ్రమైనవి కాదని, పిటిషనర్ ఆరోగ్య పరిస్థితిని పరిగణనలోకి తీసుకొని బెయిల్ మంజూరు చేస్తున్నట్లు సుప్రీం కోర్టు స్పష్టం చేసింది. సొంత పూచీకత్తు, ఇద్దరు జామీనుదారులతో, లక్ష రూపాయల షూరిటీ బాండ్లతో బెయిల్ తీసుకోవచ్చనని పేర్కొంది. గుంటూరు సీఐడీ కోర్టులో వీటిని దాఖలు చేసిన బెయిల్ తీసుకోవాలని సూచించింది.
అయితే కేసు దర్యాప్తుకు రఘురామకృష్ణరాజు సహకరించాలని పేర్కొంది. పిటిషనర్ మీడియా, సామాజిక మాధ్యమాల్లో మాట్లాడకూడదని స్పష్టం చేసింది. కేసు విరాచణకు అవసరమైతే కనీసం ఒక రోజు ముందు పిటిషనర్‍కు నోటీసులు ఇవ్వాలని అధికారులను ఆదేశించింది. న్యాయవాది సమక్షంలో దర్యాప్తు అధికారి ఎదుట హాజరవ్వొచ్చని తెలిపింది. రఘురామ బెయిల్ పిటిషన్‍పై ఇరువైపులా పోటాపోటీగా వాదనలు సాగాయి. పిటిషనర్ తరపున సీనియర్ న్యాయవాది మకుల్ రోహత్గీ, ప్రభుత్వం తరపున దవే వాదనలు వినిపించారు. ఇరువైపులా వాదనలు విన్న ధర్మాసనం ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది.