ఇదే నా తండ్రి చివరి కోరిక.. వైఎస్ సునీత..
ఏపీ రాజకీయాలు ఒక ఎత్తు అయితే వైయస్ రాజశేఖర్ రెడ్డి కుటుంబ రాజకీయాలు ఒక ఎత్తు అన్నట్టుగా ఉంది ప్రస్తుతం పరిస్థితి. గత కొద్దికాలంగా షర్మిల, జగన్, సునీత ఈ ముగ్గురు మధ్య హై టెన్షన్ కొనసాగుతున్న విషయం అందరికీ తెలిసిందే. ఎన్నికల నేపథ్యంలో వీళ్ళ మధ్య టెన్షన్ పీక్స్ కి వెళ్తోంది. ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు హోదాలో వైఎస్ షర్మిల ఎన్నికల ప్రచారానికి బస్సు యాత్ర ప్రారంభించారు. కడప జిల్లా కాశీనాయన మండలం అమగంపల్లి నుంచి షర్మిల బస్సు యాత్ర మొదలయ్యింది. ఈ యాత్రలో ఆమెకు మద్దతుగా వైయస్ వివేకా కూతురు సునీత కూడా పాల్గొనడం జరిగింది. కడప నుంచి ఎంపీగా అవినాష్ కు ప్రత్యర్థిగా షర్మిల పోటీ చేస్తున్న విషయం అందరికీ తెలిసిందే. ఈ నేపథ్యంలో షర్మిలను ప్రజలంతా దీవించాలని సునీత కోరారు. తన తండ్రిని అత్యంత క్రూరంగా చంపిన హంతకులకు టికెట్ ఇచ్చి ఎంపీ బరిలోకి ఎలా దింపుతారు అని ఆమె మండిపడ్డారు. షర్మిలను ఎంపీ చేయడం చనిపోయిన ఆమె తండ్రి వివేకా చివరి కోరిక అని చెప్పిన సునీత తన తండ్రి కోరిక నెరవేర్చాలని.. అవినాష్ ను ఓడించాలని ప్రజలకు పిలుపునిచ్చారు.













