ఎవరి అనుమతీ అవసరం లేదు… మాది ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వం
వ్యవసాయాధికారులతో సమీక్ష గురించి తాను ఎన్నికల సంఘం అనుమతి అడగలేదని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి అన్నారు. తమది ప్రజలు ఎనుకున్న ప్రభుత్వమని.. అధికారం మాకు కొత్త కాదని సృష్టం చేశారు. కొత్త నిర్ణయాలు మాత్రమే తీసుకోకూడదని ఎన్నికల నియమావళి చెబుతోందన్నారు. కరువు పరిస్థితులు, అకాల వర్షాల సమయంలో సమీక్షలు నిర్వహించవచ్చన్నారు. రాష్ట్రంలో నెలకొన్న కరవు పరిస్థితులు, అకాల వర్షాలు, ఫోని తుపాను ప్రభావంపై వ్యవసాయాధికారులతో మంత్రి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ గంట 55 నిమిషాల పాటు సమావేశం జరిగిందన్నారు. రాబోయే సీజన్లో రైతులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా విత్తనాలు, ఎరువులు సరఫరా చేయాలని అదేశించారు. 2019-20 ఏడాదికి రూ.1,13,977 కోట్ల రుణాలు మంజూరు చేయాలని లక్ష్యంగా నిర్దేశించుకున్నాం. 2014-15 నుంచి 2018-19 వరకు ఇన్పుట్ సబ్సిడీ కింద 51,87,287 హెక్టార్లకు సంబంధించి 60 లక్షల మంది రైతులకు చెల్లించేందుకు రూ.3,203 కోట్లతో కేంద్రానికి ప్రతిపాదనలు పంపినట్లు మంత్రి పేర్కొన్నారు. ఈ సమావేశంలో వ్యవసాయశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రాజశేఖర్, ప్రత్యేక కమిషనర్ మురళీధర్‌రెడ్డి, ఉద్యాన కమిషనర్ చిరంజీవి హాజరయ్యారు.













