టీటీడీ చైర్మన్ గా శిద్దా రాఘవరావు?
తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) నూతన చైర్మన్ కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది. రాష్ట్రంలోనే ప్రతిష్టాత్మకమైన టీటీడీ దేవస్థానం చైర్మన్ కోసం ఎంతో మంది ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్న తరుణంలో కొత్త వ్యక్తులకు అనుభవంతో పాటు ఆధ్యాత్మిక చింతనతో దైవసేన, ప్రజాసేవలో అనుభవం ఉన్న వారిని ఎంపిక చేసేందుకు ప్రభుత్వం సిద్దమయ్యింది. ఈ తరుణంలో బీసీ సామాజికివర్గం నుంచి ఎవరినైనా ఎంపిక చేద్దామా అనే ఆలోచనలో ప్రభుత్వ పెద్దలు ఉన్నారు. టీటీడీకి సౌమ్ముడు, అనుభవం ఉన్న వారికి ఇవ్వడం వలన అక్కడ పవిత్రత కాపాడేందుకు అవకాశం ఉంటుందని మరో కోణంలో ప్రభుత్వ పెద్దలు ఆధ్యాత్మికసేవలో గడిపే వారికి ప్రాధాన్యత ఇచ్చేలా పావులు కదుపుతున్నారు.
ఈ తరుణంలో ముఖ్యంగా ప్రకాశం జిల్లాకు చెందిన మాజీ మంత్రి శిద్దా రాఘవరావు పేరు తెరపైకి వచ్చింది. మంత్రిగా ప్రజాసేవను అందించడంతో పాటు శ్రీశైలం దేవస్థానం చైర్మన్గా పనిచేసిన అనుభవం ఉన్న శిద్దా రాఘవరావుకు టీటీడీ చైర్మన్గా ప్రకటిస్తే పుణ్యక్షేత్రంలో ఆధ్యాత్మిక శోభపెరిగేందుకు అవకాశం ఉంటుందనే భావన ప్రభుత్వ వర్గాలలో బలంగా వినిపిస్తుంది. ఇదే తరుణంలో శిద్దా రాఘవరావు రాజకీయంగా కూడా మంచిపేరు తెచ్చుకున్న నేతగా ఉండటంతో పాటు ఆర్యవైశ్య సామాజికవర్గంలో ఆయనకు ప్రత్యేకస్థానం ఉండటంతో రాజకీయంగా కూడా వైసీపీ ప్రభుత్వానికి ప్రయోజనం ఏర్పడుతుందని వైసీపీ అధిష్ఠానంలోని ముఖ్యలు భావిస్తున్నారు.













