షర్మిలకు వైఎస్ భారతి రెడ్డి సంచలన లేఖ..!
దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి(YSR) కుటుంబంలో ఆస్తుల పంపకాల వివాదం రోజురోజుకూ ముదురుతోంది. వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, వైఎస్ షర్మిల(YS Sharmila) మధ్య ఇప్పటికే ఆస్తుల విషయమై బహిరంగంగానే చర్చ జరుగుతుండగా, ఇప్పుడు ఈ వివాదంలోకి జగన్ సతీమణి వైఎస్ భారతి రెడ్డి ప్రవేశించడం సంచలనం రేపుతోంది. ఈ నెల 24న వైఎస్ షర్మిలకు భారతి రెడ్డి ఒక లేఖ రాసినట్లు తెలుస్తోంది. మన కుటుంబంలో ఆస్తులపై జరుగుతున్న చర్చలు, వివాదాలపై ఈ లేఖ ద్వారా నీకు ఒక స్పష్టత ఇవ్వదలచుకున్నానంటూ భారతి రెడ్డి అందులో పేర్కొన్నట్లు తెలుస్తోంది.
ఈ లేఖలో ప్రధానంగా బెంగళూరులో ఉన్న కొన్ని నిర్థిష్టమైన ఆస్తుల గురించి వైఎస్ భారతి రెడ్డి ప్రస్తావించారు. బెంగళూరులోని సదరు ఆస్తులతో షర్మిలకు ఎలాంటి సంబంధం గానీ, చట్టబద్ధమైన హక్కు గానీ లేదని ఆమె స్పష్టం చేశారు. ఆ ఆస్తులన్నీ తన పుట్టింటివారు తనకు బహుమతిగా ఇచ్చినవని, అలాగే తన స్వయంకృషితో, కష్టార్జితంతో సంపాదించుకున్నవని భారతి రెడ్డి వివరించారు. వాటి సంపాదనలో గానీ, లేదా వాటి నిర్మాణంలో గానీ వైఎస్ కుటుంబానికి ఎలాంటి భాగస్వామ్యం లేదని ఆమె లేఖలో స్పష్టం చేసారు.
తన పుట్టింటి వైపు నుంచి వచ్చిన, తన స్వార్జిత ఆస్తులపై షర్మిల హక్కులు కోరడం ఎంతమాత్రం సరికాదని భారతి రెడ్డి హితవు పలికారు. ఇప్పటికే జగన్, షర్మిల మధ్య నడుస్తున్న ఈ వివాదంలోకి ఇప్పుడు వదిన భారతి రెడ్డి కూడా రంగంలోకి దిగడంతో వైఎస్ కుటుంబ ఆస్తుల వ్యవహారం మరింత హీటెక్కింది. వదిన రాసిన ఈ సంచలన లేఖపై ఆడపడుచు వైఎస్ షర్మిల ఏ విధంగా స్పందిస్తారనేది ఇప్పుడు రాజకీయ, మీడియా వర్గాల్లో సర్వత్రా ఆసక్తికరంగా మారింది.








