భోగి సాంగ్స్‌తో ఆకట్టుకుంటున్న శర్వానంద్!
శర్వానంద్(Sharwanand), అనుపమ పరమేశ్వరన్(Anupama parameswaran) జంటగా నటిస్తున్న తాజా సినిమా భోగి(Bhogi) నవంబర్ 11న ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అవుతోంది. క్రియేటివ్ డైరెక్టర్ సంపత్ నంది(Sampath nandi) తెరకెక్కిస్తున్న ఈ సినిమాను తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలు, గ్రామీణ జీవనశైలికి ప్రతిబింబంగా రూపొందిస్తున్నారు. ప్రమాదకరమైన పటేల్‌కు వ్యతిరేకంగా ఓ ఊరు సాగించే పోరాటం నేపథ్యంలో హై ఓల్టేజ్ యాక్షన్ డ్రామాగా ఈ సినిమా తెరకెక్కుతోంది. 1960ల కాలాన్ని ప్రతిబింబించేలా కథ, పాత్రలు, వాతావరణాన్ని తీర్చిదిద్దిన చిత్రబృందం మ్యూజిక్ కు కూడా ప్రత్యేక ప్రాధాన్యతనిచ్చింది.
ఈ సినిమాలోని సాంగ్స్ ఇప్పటికే ఆడియన్స్ లో మంచి రెస్పాన్స్ ను సొంతం చేసుకుంటున్నాయి. ఆస్కార్ అవార్డు విన్నర్ చంద్రబోస్(Chandrabose) అందించిన సాహిత్యం తెలంగాణ పల్లె సంస్కృతిలోని సహజత్వాన్ని, పండుగల వైభవాన్ని ఆవిష్కరిస్తోంది. ఫస్ట్ సాంగ్ ఎగిలి వరంగ(Egili varanga) సంప్రదాయ వేడుకలను కళ్లకు కట్టినట్లు చూపిస్తూ ఐదు మిలియన్లకు పైగా వ్యూస్ సాధించింది. ఇక తాజాగా రిలీజైన సెకండ్ సాంగ్ అన్నయ్య పాణంలో(Annayya panamlo) అన్నాచెల్లెళ్ల బాండింగ్‌ను హృద్యంగా ఆవిష్కరించింది. ఐదుగురు చెల్లెళ్లకు అండగా నిలిచే బాధ్యతాయుతమైన అన్నయ్యగా శర్వానంద్ కనిపించిన తీరు ఆడియన్స్ ను ఆకట్టుకుంటోంది. ఈ సాంగ్ మూడు మిలియన్లకు పైగా వ్యూస్ సాధించి విశేష ఆదరణ పొందుతోంది.
భీమ్స్ సిసిరోలియో(Bheems ciciroleo) అందించిన మ్యూజిక్, చంద్రబోస్ సాహిత్యం సినిమాలోని ఎమోషన్స్ కు బలాన్నిస్తున్నాయి. మాస్ యాక్షన్‌తో పాటు ఫ్యామిలీ బాండింగ్స్, తెలంగాణ నేటివిటీకి పెద్దపీట వేస్తున్న ఈ సినిమా ఆడియన్స్ కు కొత్త అనుభూతిని అందించనుందని సాంగ్స్ సూచిస్తున్నాయి. నిర్మాత కేకే రాధామోహన్(KK Radhamohan) భారీ స్థాయిలో నిర్మిస్తున్న భోగిపై రిలీజ్ డేట్ సమీపిస్తున్న కొద్దీ అంచనాలు పెరుగుతున్నాయి.








