మాతృభూమిలో గ్రామాల దత్తత లక్ష్యంగా ముందుకు సాగుతున్న AAVGF..
అమెరికా రాజధాని మెట్రో ప్రాంతంలో : 2K వాక్ నిర్వహించిన ప్రతినిధులు
మాతృభూమి మాతృబాష మన రెండు కళ్ళు. వృత్తి ఉపాధి రీత్యా వేల మైళ్ళ దూరంలో ఉంటున్నా, మన మాతృభూమిలో ముఖ్యంగా గ్రామీణ ప్రాంత విద్య, వైద్య రంగాలలో అక్షరాస్యత, ఆరోగ్యం, పరిశుభ్రత మరియు పోషణ ప్రాతిపదికగా చేయూతనందిస్తూ ఆదర్శంగా నిలుస్తుంది అడాప్ట్ ఆ విలేజ్ గ్లోబల్ ఫౌండేషన్ సంస్థ ( Adopt A Village Global Foundation).. రెండు తెలుగు రాష్ట్రాలలో – 42 క్లస్టర్లలో 120 గ్రామాలను దత్తత తీసుకుని ప్రాధమిక అవసరాలను గుర్తించి వివిధ సేవలను అందిస్తూ లక్షలాదిమంది తెలుగు ప్రవాసులందరికీ స్ఫూర్తినిస్తోంది.
అమెరికా రాజధాని పరిధిలో జరిగిన 2k వాక్ నిర్వహిస్తూ నడక – ఆరోగ్యం – ఆనందం – సమాజ సేవ అనే నినాదంతో సమిష్టి కార్యాచరణ, సమగ్ర అవగాహనకై కార్యక్రమం నిర్వహించారు. ఉదయం 10 గంటల నుండి మొదలై, సాయంత్రం 4 గంటల వరకూ జరిగిన కార్యక్రమంలో సంస్థ విధి విధానాలు, కార్యాచరణ, స్వచ్ఛ నీరు, మెడికల్ క్యాంపు లు, కుష్టు వ్యాధి నిర్మూలన, మన ఆరోగ్యం మన చేతుల్లో ఇలా పలుఅంశాల పట్ల అవగాహన కల్పిస్తూ, చిన్నారులకు వినోద కార్యక్రమాలు నిర్వహిస్తూ గడిపారు.
సంస్థ ప్రతినిధులు డా. భూపతిరాజు పందేటి, చంద్రశేఖర రాజు ముప్పాళ్ల మాట్లాడుతూ స్వచ్ఛ భారత్, హరిత భారత్ మరియు వికసిత భారత్ లక్ష్యంగా సాగుతున్న మనందరి మూలాలు గ్రామీణ ప్రాంతాలతో ముడిపడ్డాయని, మన జన్మభూమికి తిరిగిఇవ్వాల్సిన భాద్యత మనందరిపై ఉందని, ఆ ఆలోచనల్లో నుండి పుట్టిన వేదికే AAVGF అని, జిల్లా కలెక్టర్ లతో సమన్వయము చేసుకుంటూ ముందుకు సాగుతున్నామని తెలిపారు. నిర్వాహకుల అంకితభావం, సభ్యుల సమయం, శ్రమతో స్ఫూర్తిదాయకంగా సంవత్సరాలుగా గ్రామాల దత్తతే లక్ష్యంగా ముందుకు సాగుతున్నాయని, ప్రతి ఒక్కరూ ఇందులో భాగస్వాములవ్వాలని పిలుపునిచ్చారు. మన మాతృబాష తెలుగు పరిరక్షణ కూడా మనందరి భాద్యత అని తెలిపారు..
తెలుగు పాఠశాల అధ్యక్షులు భానుప్రకాష్ మాగులూరి మాట్లాడుతూ, ఏదేశ మేగినా.. మాతృభూమిని, మాతృభాషను కాపాడుకోవటమే మనందరి విధిగా భావిస్తూ, ప్రవాస తెలుగు వారందరూ తమ గ్రామ, ప్రాంతాలకు తిరిగి ఇవ్వటం అనే గొప్ప సందేశాత్మక కార్యాచరణ మానవత్వ విలువలనూ, సామాజిక భాధ్యతనూ గుర్తుచేస్తూ నేటి యువతరానికి ఈ సత్సంప్రదాయ విలువలను, అవసరాన్ని తెలుపుతుందన్నారు.
ఈ కార్యక్రమంలో సంస్థ సభ్యులు ప్రభాకర్ రాజు, సునీల్, ప్రియాంక, భాస్కర్‌రాజు, రామ్, రవి పులిగోటి, గిరి, ప్రవీణ్ ముప్పాళ్ల లతో స్థానిక పెద్దలు మన్నే సత్యనారాయణ, ఎండూరి సీతారామారావు, చింతా రాంబాబు, రామ్మోహన్ రెడ్డి, అన్నం పూర్ణచంద్రరావు, సురేష్ రాజు, నర్సి రెడ్డి, వెంకట్రావు, రాజేందర్ పాల్గొన్నారు.










