నా రాజీనామాను ఆమోదించండి : గంటా శ్రీనివాసరావు
ఎమ్మెల్యే పదవికి తాను చేసిన రాజీనామాను ఆమోదించాలని స్పీకర్ తమ్మినేని సీతారామ్‌ను మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు కోరారు. ఈ మేరకు ఆయన లేఖ రాశారు. విశాఖ స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణ నిర్ణయాన్ని నిరసిస్తూ గతేడాది ఫిబ్రవరిలో స్పీకర్ ఫార్మాట్లో రాజీనామా చేశానని గుర్తు చేశారు. ఏడాదికి పైగా ఉక్కు కార్మికులు ఆందోళన చేస్తున్నా కేంద్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదని, స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ నిలుపుదలకు చర్యలు తీసుకోవడం లేదన్నారు. ఈ నేపథ్యంలో తాను చేసిన రాజీనామాను వెంటనే ఆమోదించాలని స్పీకర్ గంటా కోరారు. దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్న విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు. ఆయనే స్పీకర్‌కు స్వయంగా రాజీనామా లేఖ రాశారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటైజేషన్‌కు సంబంధించి కేంద్రం నిర్ణయం అమలులోకి రాగానే తన రాజీనామాను ఆమోదించాలని స్పీకర్‌ను గంటా కోరారు. 2019 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ తరపున విశాఖ ఉత్తర నియోజకవర్గం నుంచి గంటా శ్రీనివాసరావు గెలుపొందిన విషయం తెలిసిందే.













