ప్రత్యేకహోదాపై రాజీనామాకు మేం సిద్ధం.. మీరు సిద్ధమా ? : చంద్రబాబు
ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా కోసం మీ ఎంపీలను రాజీనామా చేయమనండి, మా ఎంపీలు కూడా రాజీనామా చేస్తారంటూ తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు అన్నారు. టీడీపీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో చంద్రబాబు మాట్లాడుతూ వైసీపీ అవకాశవాద రాజకీయాలతో రాష్ట్రం భ్రష్టుపట్టి పోతోందన్నారు. ప్రత్యేక హోదాపై కేంద్రం మెడలు పంచుతామని నాడు జగన్ చేసిన వ్యాఖ్యలపై ఇప్పుడు ఏం చెబుతారని ప్రశ్నించారు. వైసీపీ ఎంపీలు ఇప్పుడు ఎందుకు పోరాడరని ప్రశ్నించారు.
హోదాపై ఎందుకు పోరాడలేక పోయారు? ప్రత్యేక హోదా కోసం మీ ఎంపీలను రాజీనామా చెయ్యమనండి. మా మగ్గురు ఎంపీలు రాజీనామాలు చేస్తారు. హోదా కోసం 25 మంది ఎంపీల రాజీనామా సవాల్‌కు జగన్ సమాధానం చెప్పాలి. హోదా వస్తే ఒంగోలు లాంటి పట్టణం హైదరాబాద్ అవుతుందని నాడు జగన్ అన్నారు. హోదా వస్తే రాష్ట్రమే మారిపోతుందని జగన్ అనలేదా? విశాఖకు రాజధాని తెస్తాం అంటున్న జగన్ రైల్వే జోన్ గురించి ఏమి చెబుతారు? విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై జగన్‌కు ముందే సమాచారం ఉంది. విశాఖ ఉక్కు ఒక పరిశ్రమ మాత్రమే కాదు సెంటిమెంట్. నాడు ఎర్రంనాయుడు పార్లమెంట్లో విశాఖ ఉక్కు కోసం పోరాడారు అని పేర్కొన్నారు.













