చరిత్రలో ఒకే ఒక ఎన్టీఆర్.. ఒకే ఒక రామోజీ మాత్రమే : చంద్రబాబు
రామోజీరావు స్ఫూర్తిని భావితరాలకు అందించాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు పిలుపునిచ్చారు. సమాజానికి ఆయన ఎంతో సేవ చేశారని కొనియాడారు. విజయవాడ శివారు కానూరులోని అనుమోలు గార్డెన్స్‌లో నిర్వహించిన రామోజీరావు సంస్మరణ సభకు చంద్రబాబు హాజరయ్యారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ రామోజీరావు వ్యక్తికాదు, ఓ వ్యవస్థ. ఏ పనిచేసినా, ఎప్పుడూ ప్రజాహితం కోరుకునేవారు. నీతి, నిజాయితీకి ప్రతిరూపం రామోజీరావు. మారుమూల గ్రామంలో పుట్టి పట్టుదలతో అత్యున్నత స్థాయికి ఎదిగారు. ఎంచుకున్న ప్రతి రంగంలో నెంబర్‌వన్‌గా ఎదిగారు. 1974 ఆగస్టు 10న ఈనాడు పత్రిక విశాఖలో ప్రారంభించారు. ఐదు దశాబ్దాలుగా ఈనాడు అనునిత్యం ప్రజా చైతన్యం కోసం పనిచేస్తోంది. రామోజీరావు పత్రికారంగంలో ఉండి నిరంతరం ప్రజా సమ్యలపై పోరాడారు. జిల్లా ఎడిషన్లు తెచ్చి క్షేత్ర స్థాయిలో ప్రజా సమస్యలు ప్రస్తావించారు. ఎంతో మంది నటులు, కళాకారులు, జర్నలిస్టులకు జీవితం ఇచ్చారు. మీడియా రంగంలో చేసిన కృషికి అనేక అవార్డులు వచ్చాయి. అచంచలమైన విశ్వాసంతో ఎదిగిన వ్యక్తికి గొప్ప ఉదాహరణ రామోజీరావు. చరిత్రలో ఒకే ఒక ఎన్టీఆర్, ఒకే ఒక రామోజీ మాత్రమే ఉంటారు. ప్రియా పచ్చళ్లను 150 దేశాలకు ఎగుమతి చేశారు. రామోజీ ఫిల్మ్ సిటీని అద్భుతంగా తీర్చిదిద్దారు. 1982లో ఎన్టీఆర్ పార్టీ పెట్టినప్పుడు 9 నెలల్లో అధికారంలోకి వచ్చారంటే అందులో రామోజీరావు పాత్ర కీలకం. ఎన్నికష్టాలు వచ్చినా భయపడలేదు. ధైర్యంగా ఎదుర్కొన్నారు. హైదరాబాద్ అభివృద్ధిలో రామోజీరావు పాత్ర ఎంతో ఉందన్నారు.
నవ్యాంధ్రకు ఏ పేరు పెట్టాలా? అని ఆలోచిస్తున్న సమయంలో రీసెర్చ్ చేసి అమరావతి పేరును సూచించారు. ఐదేళ్ల పాటు ఇబ్బందులు ఎదుర్కొన్నా. ఇక నుంచి అమరావతి దశ, దిశ మారుతుంది. తెలుగుజాతి ఉజ్వల భవిష్యత్తుకు అమరావతి నాంది పలుకుతుంది. తెలుగు భాష, తెలుగు జాతి అంటే ఆయనకు ఎనలేని ఆప్యాయత. ఢిల్లీలో విజ్ఞాన్ భవన్ మాదిరిగా, అమరావతిలో రామోజీ విజ్ఞాన కేంద్రం ఏర్పాటు చేస్తాం. అమరావతిలో ఒక రోడ్డుకు రామోజీరావు మార్గ్ అని పేరు పెడతాం. విశాఖపట్నంలో చిత్రనగరి ఏర్పాటు చేస్తాం. తెలుగుజాతికి ఆయన చేసిన సేవలకు గానూ తగిన గుర్తింపు రావాలి. ఎన్టీఆర్, రామోజీరావులకు భారతరత్న సాధించడం మన బాధ్యత. రామోజీరావు ప్రజల ఆస్తి. ఆయన స్థాపించిన వ్యవస్థలను భావితరాలకు అందించాలి అని సూచించారు. సంస్మరణ సభకు వచ్చిన అందరికీ సీఎం చంద్రబాబు కృతజ్ఞతలు తెలిపారు.













