దేశ భవిష్యత్ కోసం కలిసి పనిచేస్తాం : చంద్రబాబు
కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీతో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమావేశం ముగిసింది. గంటకు పైగా రాహుల్ గాంధీతో చంద్రబాబు చర్చలు జరిపారు. అనంతరం ఇరువురు మీడియాతో మాట్లాడారు. దేశ భవిష్యత్ కోసం పనిచేయాలని నిర్ణయించామని, గతాన్ని వదిలేసి భవిష్యత్ కోసం కృషి చేస్తామని రాహుల్ గాంధీ అన్నారు. రాఫెల్ వ్యవహారంలో అవినీతి జరిగిందనడంలో సందేహం లేదన్నారు. అనంతరం చంద్రబాబు మాట్లాడుతూ దేశాన్ని, ప్రజాస్వామాన్ని రక్షించాలనే రాహుల్ గాంధీతో కలిశానని, బీజేపీ వ్యతిరేక పక్షాలన్నింటినీ ఏకతాటిపైకి తీసుకొస్తామన్నారు. దేశంలో వ్యవస్థలన్నింటినీ బీజేపీ ప్రభుత్వం నాశనం చేస్తోందని మండిపడ్డారు. ఈ నేపథ్యంలో బీజేపీ యేతర పార్టీలన్నీ ఒక సమావేశాన్ని పెట్టుకుని భవిష్యత్ కార్యాచరణ నిర్ణయిస్తామని తెలిపారు.













