పోలవరం నిధులు సాధిస్తారా? లేదా? : చంద్రబాబు
వైకాపా ప్రభుత్వం చేతగానితనంతో పోలవరం అంశంలో చాలా సమస్యలు వస్తున్నాయని ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు విమర్శించారు. కేసుల భయంతో నిధుల విషయంపై కేంద్రాన్ని అడగలేక సరెండర్ అయ్యారని ఆరోపించారు. శాసనసభ శీతాకాల సమావేశాల్లో భాగంగా మూడో రోజు పోలవరం ప్రాజెక్టుపై జరిగిన చర్చలో ఆయన మాట్లాడారు. ఎన్నికల ముందు వైకాపా చెప్పిన మాటలన్నీ విని ప్రజలు 151 మంది ఎమ్మెల్యేలు, 22 మంది ఎంపీలను గెలిపించారని, పోవరలం పూర్తి చేయడం రాష్ట్ర ప్రభుత్వం బాధ్యతని చెప్పారు. కేంద్రంతో మాట్లాడి పోలవరం నిధులు సాధిస్తారా? లేదా? అని చంద్రబాబు ప్రశ్నించారు. 22 ఎంపీలు ఏం చేస్తున్నారని ఆయన నిలదీశారు. పోలవరం భూసేకరణ చేసి ఆర్అండ్అర్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. దీనిపై కేంద్రాన్ని ఒప్పించకపోతే చరిత్రహీనులగా మిగిలిపోతారని వైకాపా ప్రభుత్వాన్ని ఉద్దేశించి విమర్శించారు. ఎన్నికల్లో గెలిపిస్తే మేం పోరాడతాం, సాధిస్తామని చెప్పారని, ఇప్పుడు నాటకాలాడొద్దని తీవ్రస్థాయిలో చంద్రబాబు మండిపడ్డారు.













