‘కాపు’ కాస్తేనే రాష్ట్రాభివృద్ధి..
వైనాట్ 175 అంటూ బింకాలు పలికిన సీఎం జగన్.. ఇప్పుడు ఓటమి భయంతో ఉన్నారని జనసేనాని పవన్ కల్యాణ్ ఆరోపించారు. రాజకీయ విమర్శలు పక్కనపెట్టి, తన వ్యక్తిగత జీవితాన్ని టార్గెట్ చేస్తున్నారని.. అయితే ఇలాంటి వాటికి తాను భయపడేవాడిని కాదన్నారు. ఇప్పుడు తాజాగా జనసేనపై.. కులాస్త్రాన్ని వైసీపీ ప్రయోగిస్తోందని పవన్ కల్యాణ్ ఆరోపణలు గుప్పించారు. కొందరు కాపు పెద్దలను రెచ్చగొట్టి జనసేన పార్టీని బలహీనపరిచేలా కుట్రలకు దిగుతోందని, ఆ వలలో కాపు సామాజికవర్గం పడవద్దని పవన్‌కల్యాణ్ పిలుపునిచ్చారు. స్వప్రయోజనాల కోసం వైసీపీ చేస్తున్న ఈ విషప్రచారపు ఉచ్చులో పడొద్దని, ఆ వార్తలను కాపులతో పాటు సామాన్య ప్రజలూ నమ్మవద్దని విన్నవించారు.
‘‘వైసీపీ వ్యతిరేక ఓటు చీలకుండా తాను చేస్తున్న కార్యాచరణ.. వైసీపీ అధినేతకు కంటగింపుగా మారిందన్నారు పవన్.. అన్ని సామాజికవర్గాల్లో నిర్దిష్టమైన ఓట్ల శాతంతో పాటు, కాపు సామాజికవర్గంలో బలమైన మద్దతు జనసేనకు ఉండటం వైసీపీకి జీర్ణం కావట్లేదన్నారు.. అందుకే కొందరు కాపు పెద్దలను కుట్రపూరితంగా జనసేనపై ప్రయోగిస్తోందని ఆరోపించారు.. వారితో తనపైనా, పార్టీపైనా సామాజిక మాధ్యమాల్లో విషపురాతలు రాయిస్తోందని.. వాటిని కాపు సామాజికవర్గం వారి ఫోన్లకే పంపుతోందని ఆరోపించారు.
రాష్ట్రంలో పట్టాలు తప్పిన పాలనను సరిదిద్దే క్రమంలో కాపు సామాజికవర్గం గురుతర పాత్ర పోషించనుంది. రాష్ట్ర ప్రయోజనాల కోసం తీసుకుంటున్న నా నిర్ణయాలకు విస్తృత మద్దతు లభిస్తోంది. ఎస్సీ, ఎస్టీ, బీసీ కులాల సాధికారితతో పాటు అగ్రవర్ణ పేదలకు అండగా నిలిచి వారి ఆర్థిక ఉన్నతికి తోడ్పడాలనే ఉద్దేశంతో కులాలను కలిపే ఆలోచనా విధానంతో అడుగులు వేస్తున్నాను. అనేక బీసీ కులాలు, సంఖ్యాబలం లేని ఎంబీసీలు, మాల, మాదిగ, రెల్లి, ఎస్సీ ఉపకులాలు, ఎస్టీ కులాలను కలిపి అడుగులు వేసే సమర్థత ఉన్నందునే కాపులు పెద్దన్న పాత్ర తీసుకోవాలని కోరాను. అందుకు అనుగుణంగా కాపు యువత, మహిళలు, విజ్ఞులు నడుం బిగించారు. దూరదృష్టితో దీర్ఘకాలిక రాష్ట్ర ప్రయోజనాలే లక్ష్యంగా పనిచేస్తాను. అవి ఇప్పటికిప్పుడు కంటికి కనిపించకపోవచ్చు. నేను ఆశించిన లక్ష్యాలు నెరవేరిన రోజున ఇప్పుడు దూషిస్తున్న కాపు పెద్దలు కచ్చితంగా హర్షిస్తారు’’ అన్నారు పవన్.
కాపు రిజర్వేషన్ పోరాటాన్ని హింసాత్మకంగా మార్చిన క్రిమినల్ బ్రెయిన్ ఆ తర్వాత ఎటు వెళ్లిందో కాపు సామాజికవర్గం గుర్తించిందన్నారు పవన్. కాపులకు రిజర్వేషన్ ఇచ్చేది లేదని ఆ వర్గానికి బలమైన జిల్లాలోనే ప్రకటించిన జగన్‌రెడ్డిని కాపు పెద్దలు ప్రశ్నించాలి. కాపు కార్పొరేషన్‌కు నిధుల కేటాయింపు ఏమైందో నిలదీయాలి. ఈడబ్ల్యుఎస్ రిజర్వేషన్లలో కాపుల కోటాను తొలగించిన వ్యక్తిని ప్రశ్నించండి. కాపులను కాపు నాయకులతోనే తిట్టిస్తున్న వ్యక్తిని కాకుండా, నన్ను దూషించడం వల్ల ఎవరికి ప్రయోజనమో గ్రహించాలి. కుట్రలు, కుతంత్రాలతో అల్లిన వైసీపీ వలలో చిక్కుకోవద్దని నాకు ఎంతో గౌరవం ఉన్న కాపు పెద్దలకు విజ్ఞప్తి చేస్తున్నాను. వారికి జనసేన పార్టీ వాకిలి ఎప్పుడూ తెరిచే ఉంటుంది’’ అని పవన్‌కల్యాణ్ స్పష్టం చేశారు.













