రాజా కసుకుర్తిని సత్కరించిన రంగన్నగూడెం పెద్దలు
ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) కార్యదర్శిగా అటు అమెరికాలోని తెలుగు కమ్యూనిటీకి, ఇటు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న తెలుగువారికి సేవలందిస్తున్న రాజా కసుకుర్తి ఇటీవల స్వగ్రామానికి వచ్చినప్పుడు ఆయనకు ఘనస్వాగతం లభించింది. ఇటీవల జరిగిన తానా ఎన్నికల్లో పెద్ద మెజారిటీతో రాజా కసుకుర్తి కార్యదర్శిగా ఎన్నికైన తరువాత తొలిసారిగా కృష్ణా జిల్లా వీరవల్లి గ్రామానికి వచ్చినప్పుడు ఆయనకు గ్రామ ప్రముఖులు, ఇతరులు ఘనంగా స్వాగతం పలికారు. రంగన్నగూడెం గ్రామం కమ్యూనిటీ హాల్ లో రంగన్న గూడెం రూరల్ డెవలప్మెంట్ సొసైటీ (ఆర్.అర్. డీ.ఎస్) ఆధ్వర్యంలో గ్రామ పెద్దలు, గ్రామ ప్రజాప్రతినిధులు ఆయనకు ఆత్మీయ సత్కారం చేశారు. ఈ సందర్భంగా రంగన్నగూడెం రూరల్ డెవలప్మెంట్ సొసైటీ కార్యదర్శి, సాగునీటి వినియోగదైరుల సమాఖ్య రాష్ట్ర అధ్యక్షులు ఆళ్ళ వెంకట గోపాల కృష్ణారావు రాజా కసుకుర్తిని పూలమాలలు వేసి, దృశ్యాలువాతో ఘనంగా సత్కరించి పుష్పగుచ్చం అందజేసి, హనుమాన్ దేవాలయం చిత్రపటాన్ని అందజేశారు.







