అధికార మార్పిడి తర్వాత తామే పేరు మారుస్తాం : పవన్
అణగారిన వర్గాల ఆశాజ్యోతి దామోదరం సంజీవయ్య పేరును కర్నూలు జిల్లాకు పెట్టాలని జనసేన అధినేత పవన్ కల్యాణ్ డిమాండ్ చేశారు. కోటి రూపాయల నిధులు సేకరించి దామోదరం సంజీవయ్య స్మారక భవనాన్ని నిర్మిస్తామని అన్నారు. కర్నూలు జిల్లాలోని పెదపాడులో ఉన్న ఆయన ఇంటిని పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేస్తామని తెలిపారు. ఒక హక్కుగా తాము ఈ విషయంపై రాష్ట్ర ప్రభుత్వాన్ని అడుగుతున్నామని తెలిపారు. వైకాపా ప్రభుత్వం పట్టించుకోకపోతే అధికార మార్పిడి తర్వాత జనసేన పార్టీయే జిల్లాకు దామోదరం సంజీవయ్య కర్నూలు జిల్లాగా పేరు మారుస్తుందన్నారు. అందుకు తాము కట్టుబడి ఉంటామని స్పష్టం చేశారు. అంతకముందు ప్రభుత్వాలు ఈ పని చేయలేదని, కనీసం ఈ ప్రభుత్వమైనా చేసి ఆ మహామనిషికి గౌరవం ఇవ్వాలని కోరారు. కడప జిల్లాను వైఎస్ఆర్ కడప జిల్లా అని మార్చిన విషయాన్ని పరిగణనలోకి తీసుకుకోవాలని సూచించారు.













