Pawan Kalyan: మీరు అందిస్తున్న సేవలు అనన్య సామాన్యం : పవన్ కల్యాణ్
వైద్యరంగంలో నర్సులు అందిస్తున్న సేవలు అనన్య సామాన్యమని ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ (Pawan Kalyan) కొనియాడారు. అంతర్జాతీయ నర్సుల దినోత్సవాన్ని (International Nurses Day) పురస్కరించుకుని మంగళగిరిలోని క్యాంపు కార్యాలయంలో పిఠాపురం నియోజకవర్గం పరిధిలోని ప్రభుత్వ ఆసుపత్రుల్లో పని చేస్తున్న స్టాఫ్ నర్సులతో (Staff nurse) ఆయన సమావేశం అయ్యారు. ఉత్తమ సేవలు అందించిన ఎనిమిది మందిని సత్కరించారు. వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా పవన్ మాట్లాడుతూ ఫ్లోరెన్స్ నైటింగేల్ స్ఫూర్తితో రోగులకు స్వస్థత కలిగేలా వృత్తికి గౌరవాన్ని తీసుకువస్తున్నారని పేర్కొన్నారు. నిస్వార్థంగా వారు అందించే సేవలు వెలకట్టలేనివన్నారు. నర్సుల చేతి స్పర్శ కూడా రోగిలో మానసిక స్థైర్యంతో పాటు సాంత్వన కలిగిస్తుందని తెలిపారు.
విధి నిర్వహణలో ఎంతో మంది రోగుల ప్రాణాలు కాపాడుతున్న నర్సుల సేవలను ఎవరూ మరిచిపోరు. మీరు పడే శ్రమ, కష్టం నాకు తెలుసు. కొవిడ్ (Covid) సమయంలో ప్రాణాలను సైతం లెక్క చేయకుండా విధులు నిర్వర్తించిన విధానం మరువలేం. ఇటీవల సింగపూర్లో నా కుమారుడు మార్క్ శంకర్ ప్రమాదానికి గురై ఆసుపత్రిలో ఉన్న సమయంలో అక్కడ నర్సులు చేసిన సేవలు చూసినప్పుడు మరోసారి మీ కష్టం గుర్తుకువచ్చింది. మిమ్మల్ని కలసి మీరు అందించే సేవలు మరచిపోలేనివి అని చెప్పి కృతజ్ఞతలు చెప్పాలనుకున్నాను. అంతర్జాతీయ నర్సుల దినోత్సవాన్ని పురస్కరించుకుని కలిసే అవకాశం రావడం ఆనందాన్నిచ్చింది. నా దృష్టికి తీసుకువచ్చిన సమస్యలను వైద్యఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ దృష్టికి తీసుకువెళ్తాం అని తెలిపారు.













