అక్రమ కేసులకు భయపడేది లేదు… న్యాయపరంగానే ఎదుర్కొంటాం
ఓటమి భయంతో సీఎం జగన్ రోజురోజుకీ దిగజారుడు రాజకీయాలకు పాల్పడుతున్నారని మాజీ మంత్రి, టీడీపీ నేత ప్రతిపాటి పుల్లారావు మండిపడ్డారు. తప్పుడు కేసులతో ప్రత్యర్థులను వేధింపులకు గురి చేస్తున్నారని విమర్శించారు. కంపెనీలో డైరెక్టర్‌గా, కనీసం షేర్ హోల్డర్ కూడా కాని తన కుమారుడు శరత్‌పై కక్షతో జీఎస్టీ ఎగవేతల ఉల్లంఘన కేసులు పెట్టారన్నారు. తన కుమారుడి అరెస్టు నేపథ్యంలో చిలకలూరిపేటలో ఆయన మీడియాతో మాట్లాడుతూ టీడీపీ తరపున నాకు చిలకలూరిపేట సీటు ఖరారు చేసిన రోజు సాయంత్రమే కేసు నమోదు చేశారు. కనీసం ముందస్తు నోటీసులు ఇవ్వకుండా అదుపులోకి తీసుకున్నారు. గతంలోనూ ఇలాగే బురదజల్లాలని చూశారు. ఇప్పుడు మరోసారి అదే పన్నాగం పన్నిట్లు కనిపిస్తోంది. మాకు సంబంధం లేని కంపెనీ పేరుతో దుష్ప్రచారానికి ఒడిగట్టారు. ప్రతిపాటి కుటుంబానికి ఉన్న విశ్వసనీయతను దెబ్బ తీయడానికి ఇలాంటి దుర్మార్గపు ఆలోచనలు చేస్తున్నారు. అక్రమ కేసులకు భయపడేది లేదు. న్యాయపరంగానే ఎదుర్కొంటాం. చిలకలూరిపేటలో పోటీకి వైసీపీకి అభ్యర్థులు దొరక్కట్లేదు అని ఎద్దేవా చేశారు.













