ఆ కేసును సుప్రీంకోర్టుకు బదిలీ చేయం
పోలవరం ముంపు బాధితులకు ఆరునెలల్లో పునరావాసం, పరిహారం చెల్లించాలని జాతీయ హరిత ట్రైబ్యునల్ (ఎన్జీటీ) ఆదేశించింది. ఏపీలో బాధితులకు పునరావాసం, పరిహారంపై పెంటపాటి పుల్లారావు, తెలంగాణలో ముంపు ప్రభావానికి సంబంధించి పొంగులేటి సుధాకర్‌రెడ్డి దాఖలు చేసిన రెండు పిటిషన్లపై ఎన్జీటీ విచారణ చేపట్టింది. మంపు ప్రభావంపై ఏర్పాటు చేసిన సంయుక్త కమిటీ నివేదికను ఎన్జీటీ ఆమోదించింది. కేసును సుప్రీంకోర్టుకు బదిలీ చేయాలన్న కమిటీ ప్రతిపాదనను ఎన్జీటీ తోసిపుచ్చింది.
అంతరాష్ట్ర జలవివాదాల జోలికి వెళ్లకుండా పర్యావరణంపై ప్రభావం, బాధితులకు పరిహారం అంశాలపై విచారిస్తామని సృష్టం చేసింది. రెండు నెలల్లో పోలవరం ప్రాజెక్టుకు ఎగువరాష్ట్రాలైన తెలంగాణ, ఒడిశా, ఛత్తీస్‌గడ్‌తో సమావేశం ఏర్పాటు చేయాలని ఆదేశించింది. కేంద్ర జలసంఘం, పోలవరం ప్రాజెక్టు అథారిటీ, గోదావరి జలవివాదాల ట్రైబ్యునల్, ఏపీ జలవనరులశాఖ సంయుక్తంగా ఈ సమావేశం నిర్వహించాలని సూచించింది. ఎగువ రాష్ట్రాల సందేహాలను తీర్చాలన్న కమిటీ సిఫార్సులకు ఎన్జీటీ ఆమోదం తెలిపింది. పోలవరం పూర్తయతే భద్రాచలం వద్ద గోదావరి నదికి ఇరువైపులా ఉన్న ప్రాంతాలు ముంపునకు గురయ్యే అంశంపై తెలుగురాష్ట్రాలు చర్చించి చర్యలు తీసుకోవాలని ఆదేశించింది.













