New Districts: ఏపీలో కొత్త జిల్లాలు, పేర్లు ఇవే..!?

ఆంధ్రప్రదేశ్ లో జిల్లాల పునర్విభజన (Districts reorganization), కొత్త జిల్లాల ఏర్పాటు (New Districts), జిల్లాల పేర్ల మార్పుపై రాష్ట్ర ప్రభుత్వం తీవ్రంగా కసరత్తు చేస్తోంది. గత వైఎస్సార్‌సీపీ (YCP) ప్రభుత్వం 2022లో రాష్ట్రంలోని 13 జిల్లాలను 26 జిల్లాలుగా విభజించినప్పటికీ, ఈ విభజన సరిగా జరగలేదని, ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ప్రస్తుత కూటమి ప్రభుత్వం భావిస్తోంది. ఈ నేపథ్యంలో, పరిపాలనా సౌలభ్యం, ప్రజల సౌకర్యం కోసం జిల్లాల సరిహద్దులు, పేర్లు, కొత్త జిల్లాల ఏర్పాటుపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. ఇందులో భాగంగా మంత్రివర్గ ఉపసంఘం (Cabinet Sub Committee) ఈ నెల 29, 30 తేదీల్లో జిల్లా పర్యటనలు చేపట్టనుంది. ఆగస్టు 21న జరిగే క్యాబినెట్ సమావేశంలో ఈ అంశంపై కీలక చర్చ జరిగే అవకాశం ఉంది.
ప్రస్తుతం రాష్ట్రంలో 26 జిల్లాలు ఉండగా, వీటి సంఖ్యను 32కి పెంచే ప్రతిపాదనలు బలంగా వినిపిస్తున్నాయి. అమరావతిని ఒక ప్రత్యేక జిల్లాగా ఏర్పాటు చేయడం ద్వారా రాజధాని ప్రాంత అభివృద్ధికి మరింత ప్రాధాన్యత లభిస్తుందని ప్రభుత్వం భావిస్తోంది. పెదకూరపాడు, తాడికొండ, మంగళగిరి, జగ్గయ్యపేట, నందిగామ నియోజకవర్గాలతో అమరావతి జిల్లాను (Amaravati District) ఏర్పాటు చేసే అవకాశం ఉంది. అలాగే, ప్రకాశం జిల్లాలో మార్కాపురం కేంద్రంగా కొత్త జిల్లా ఏర్పాటు చేయాలని సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా శ్రీబాల వీరాంజనేయస్వామి వినతి సమర్పించారు. మదనపల్లి, గూడూరు, ఆదోని, పలాస, పోలవరం ప్రాంతాలను కూడా కొత్త జిల్లాలుగా ఏర్పాటు చేసే ప్రతిపాదనలు పరిశీలనలో ఉన్నాయి. ఈ కొత్త జిల్లాల ఏర్పాటు ద్వారా జిల్లా కేంద్రాలకు ప్రయాణ దూరాన్ని తగ్గించి, పరిపాలనను మరింత సమర్థవంతంగా మార్చాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.
జిల్లాల పేర్ల మార్పు కూడా ఈ పునర్విభజనలో కీలక అంశంగా ఉంది. గుంటూరు, పల్నాడు, బాపట్ల జిల్లాల్లో ఏదో ఒక జిల్లాకు ప్రముఖ కవి గుర్రం జాషువా పేరు పెట్టాలని మాజీ మంత్రి డొక్కా మాణిక్య వరప్రసాద్ వినతి సమర్పించారు. అలాగే, కృష్ణా జిల్లాకు ‘వంగవీటి రంగా’ (Vangaveeti Ranga District) పేరు పెట్టే ప్రతిపాదన కూడా పరిశీలనలో ఉంది. బాపట్ల జిల్లాకు దుగ్గిరాల గోపాలకృష్ణయ్య పేరు పెట్టాలని కొందరు డిమాండ్ చేస్తున్నారు. జిల్లాల పునర్విభజనతో పాటు మండలాలు, రెవెన్యూ డివిజన్ల సరిహద్దులను కూడా మార్చడంపై ప్రభుత్వం దృష్టి సారించింది. చిత్తూరు జిల్లాలోని వెదురుకుప్పం మండలాన్ని తిరుపతి జిల్లాలో కలపాలని, కృష్ణా జిల్లాలోని కొత్తపల్లి, బిళ్లపల్లి, మడిచర్ల గ్రామాలను బాపులపాడు మండలం నుంచి తొలగించి నూజివీడు లేదా ముసునూరు మండలాల్లో కలపాలని వినతులు వచ్చాయి. శ్రీకాకుళం జిల్లాలో లావేరు మండల కేంద్రంగా మురపాకను మార్చాలని, అల్లూరి సీతారామరాజు జిల్లాలో వై.రామవరం మండలాన్ని విభజించి కొత్త మండలం ఏర్పాటు చేయాలని డిమాండ్లు ఉన్నాయి.
జిల్లాల పునర్విభజనపై సమగ్ర అధ్యయనం కోసం రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ నేతృత్వంలో మంత్రివర్గ ఉపసంఘం ఏర్పాటైంది. మంత్రులు నాదెండ్ల మనోహర్, వంగలపూడి అనిత, బీసీ జనార్దన్‌రెడ్డి, పి. నారాయణ, సత్యకుమార్ యాదవ్, నిమ్మల రామానాయుడు ఈ ఉపసంఘంలో సభ్యులుగా ఉన్నారు. ఈ నెల 29, 30 తేదీల్లో 13 ఉమ్మడి జిల్లా కేంద్రాలతో పాటు అల్లూరి సీతారామరాజు జిల్లాలోని పాడేరు, రంపచోడవరం, పోలవరం ముంపు ప్రాంతంలోని ఏడు మండలాల్లో పర్యటించనుంది. కలెక్టర్లు, ప్రజాప్రతినిధులతో చర్చించి ప్రజల నుంచి వినతులు స్వీకరించనుంది. సెప్టెంబర్ 2 వరకు కలెక్టర్ కార్యాలయాల్లో కూడా వినతులు స్వీకరిస్తారు. ఈ వినతుల ఆధారంగా సెప్టెంబర్ 15 నాటికి ప్రభుత్వానికి నివేదిక సమర్పించనున్నారు. డిసెంబర్ 31 నాటికి ఈ ప్రక్రియ పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ నెల 21న జరిగే క్యాబినెట్ సమావేశంలో ఈ ప్రతిపాదనలపై చర్చ జరిగే అవకాశం ఉంది.