New Districts: ఏపీ జిల్లాల పునర్విభజన.. అసంపూర్ణ నిర్ణయాలు.. రాజకీయ అనిశ్చితి!
“ఏదైనా పనిని టేక్ అప్ చేస్తే దానిని సంపూర్ణంగా, లోపభూయిష్టం లేకుండా పూర్తి చేయాలి. అలా చేసే సత్తా లేనప్పుడు అసలు ఆ పనిని మొదలుపెట్టకూడదు.” ఇది పరిపాలనలో ఉండాల్సిన ప్రాథమిక సూత్రం. కానీ, ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో జిల్లాల పునర్విభజన (Districts Reorganization) విషయంలో కూటమి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు ఈ సూత్రానికి విరుద్ధంగా ఉన్నాయనే విమర్శలు బలంగా వినిపిస్తున్నాయి. గత ప్రభుత్వం చేసిన తప్పులను సరిదిద్దాల్సిన చోట, ప్రస్తుత ప్రభుత్వం మరిన్ని గందరగోళాలకు తెరలేపుతోందనే అనుమానాలు తలెత్తుతున్నాయి. ముఖ్యంగా అన్నమయ్య జిల్లా రద్దు ప్రతిపాదన రాజకీయంగా కూటమికి ‘సెల్ఫ్ గోల్’ కానుందనే టాక్ వినిపిస్తోంది.
గతంలో వైఎస్ జగన్ ప్రభుత్వం జిల్లాల విభజన చేపట్టినప్పుడు, పరిపాలనా సౌలభ్యం కంటే రాజకీయ అవసరాలకే పెద్దపీట వేసిందనే వాదన ఉంది. తన తండ్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో రూపొందించిన అసెంబ్లీ, పార్లమెంట్ నియోజకవర్గాలనే ప్రామాణికంగా తీసుకుని జగన్ జిల్లాలను ఏర్పాటు చేశారు. అది వారి పార్టీకి అనుకూలమైన నిర్ణయం.
అయితే, ఇప్పుడు అధికారంలోకి వచ్చిన చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం, ఆ లోపాలను సరిదిద్దే క్రమంలో మరింత పొలిటికల్ ఇంటెలిజెన్స్ ప్రదర్శించాల్సి ఉంది. భవిష్యత్తులో నియోజకవర్గాల పునర్విభజన (Delimitation) జరగబోతోంది. అసెంబ్లీ సీట్లు పెరగబోతున్నాయి. ఒక దార్శనికత ఉన్న నాయకత్వం చేయాల్సిన పని.. ఆ భవిష్యత్ నియోజకవర్గాల స్వరూపాన్ని ఇప్పుడే అంచనా వేసి, దానికి అనుగుణంగా జిల్లాలను శాస్త్రీయంగా ఏర్పాటు చేయడం. అది నిజమైన ధైర్యం, రాజనీజ్ఞత అవుతుంది. కానీ, ప్రభుత్వం ఆ దిశగా ఆలోచించకుండా, అరకొరా మార్పులతో సరిపెడుతుండటం విస్మయం కలిగిస్తోంది.
ప్రతి జిల్లాలో కచ్చితంగా 7 అసెంబ్లీ నియోజకవర్గాలే ఉండాలనే రూల్ ఎందుకు పెట్టుకున్నారో ఎవరికీ అర్థం కాని విషయం. ఉమ్మడి రాష్ట్రంలో కొన్ని జిల్లాల్లో 17 నియోజకవర్గాలు, మరికొన్నింటిలో 9 ఉండేవి. పరిపాలన సాఫీగా సాగింది. కేవలం ఒక సంఖ్యను ప్రామాణికంగా తీసుకోవడం వల్ల భౌగోళిక స్వరూపం, ప్రజల మనోభావాలు దెబ్బతింటున్నాయి. ప్రాంతీయ అవసరాలు, విస్తీర్ణాన్ని బట్టి ఒక జిల్లాలో 5, మరొక జిల్లాలో 9 నియోజకవర్గాలు ఉన్నా నష్టం లేదు. ఈ వెసులుబాటును విస్మరించి, గీత గీసినట్టుగా జిల్లాలను మార్చాలనుకోవడం సరికాదన్నది విశ్లేషకుల మాట.
జిల్లాల పునర్విభజన గందరగోళానికి ప్రధాన కేంద్రం ఇప్పుడు అన్నమయ్య జిల్లా. ఈ జిల్లాను రద్దు చేసి, దాని పరిధిలోని ప్రాంతాలను వేరే జిల్లాల్లో కలపాలన్న ప్రతిపాదన తీవ్ర దుమారం రేపుతోంది. ముఖ్యంగా ఒకప్పుడు కడప జిల్లాలో అంతర్భాగంగా, ఆత్మగా ఉన్న రాయచోటి, రాజంపేట, కోడూరు నియోజకవర్గాలను ఇప్పుడు ముక్కలు చేసి మూడు వేర్వేరు జిల్లాల్లో కలపడం ఆ ప్రాంత ప్రజలకు మింగుడు పడటం లేదు.
వైసీపీ హయాంలో అన్నమయ్య జిల్లా ఏర్పాటయ్యింది. ఇప్పుడు టీడీపీ ప్రభుత్వం దాన్ని రద్దు చేస్తే, అది ప్రజల్లో సెంటిమెంట్ అంశంగా మారుతోంది. రాజకీయంగా చూస్తే, రాయచోటిలో దాదాపు 20 ఏళ్ల తర్వాత ప్రజలు టీడీపీని గెలిపించారు. ఇంతకాలం తర్వాత అధికారం ఇస్తే.. అభివృద్ధి బదులు ఉన్న జిల్లా కేంద్రాన్ని, జిల్లా అస్తిత్వాన్నే రద్దు చేయడం ఏంటనే ఆగ్రహం స్థానికుల్లో కట్టలు తెంచుకుంటోంది. మా తీర్పుకి ఇదేనా మీరు ఇచ్చే బహుమతి? అని రాయచోటి ఓటర్లు ప్రశ్నిస్తున్నారు.
అన్నమయ్య జిల్లాను రద్దు చేయడం ద్వారా కూటమి ప్రభుత్వం అనవసరమైన రాజకీయ వైరాన్ని కొనితెచ్చుకుంటోంది. ఇది పరోక్షంగా వైసీపీకి సానుభూతిని, టీడీపీపై వ్యతిరేకతను పెంచే ప్రమాదం ఉంది. రాయచోటి, రాజంపేట వాసుల మనోభావాలను గౌరవించకుండా, కేవలం మ్యాప్ మీద గీతలు మార్చడం వల్ల వచ్చేది పరిపాలనా సౌలభ్యం కాదు.. ప్రజా వ్యతిరేకత మాత్రమే. ప్రభుత్వం ఇప్పటికైనా అరకొరా నిర్ణయాలను పక్కనపెట్టి, భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకుని సమగ్రమైన, శాస్త్రీయమైన రీతిలో జిల్లాల పునర్విభజన చేపట్టాలి. లేదంటే, ఈ నిర్ణయం భవిష్యత్తులో కూటమి ప్రభుత్వానికి పెద్ద రాజకీయ గుదిబండగా మారే అవకాశం లేకపోలేదు.






