ఆటోమొబైల్ కేంద్రంగా ఏపీ : చంద్రబాబు
రాష్ట్రాన్ని ఆటోమొబైల్ కేంద్రంగా తయారు చేసేందుకు అనేక ప్రయత్నాలు చేస్తున్నట్లు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. పరిశ్రమల ఏర్పాటుకు రాష్ట్రానికి అనేక అనుకూలతలు ఉన్నాయని, పారిశ్రామికవేత్తలు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. చిత్తూరు జిల్లా వరదయ్యాపాలెం మండలం చిన్నపాండూరు వద్ద ఏర్పాటు చేస్తున్న అపోలో టైర్స్ పరిశ్రమకు ముఖ్యమంత్రి శంకుస్థాపన చేశారు. అనంతరం చంద్రబాబు మాట్లాడుతూ చెన్నైతో పాటు హంగరీలో అంతర్జాతీయ స్థాయి కేంద్రాలను నెలకొల్పిన అపోలో సంస్థ, తాజాగా తన సొంత జిల్లా చిత్తూరులో ఏర్పాటు చేయడం గర్వకారణమని అన్నారు. తొలి దశలో రూ.1800 కోట్లతో ఆ తర్వాత రూ.5వేల కోట్ల పెట్టుబడులతో పరిశ్రమ స్థాపిస్తున్నట్లు చెప్పారు. దీనివల్ల ప్రత్యక్షంగా 700 మందికి పరోక్షంగా వేల మందికి ఉపాధి అకాశాలు లభించనున్నట్లు వెల్లడించారు.













