Nara Lokesh: లోకేష్ ముంబై పర్యటన విజయవంతం

ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తరువాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పెట్టుబడులకు స్వర్గధామంగా మారుతోందని, ప్రపంచ ప్రసిద్ధ సంస్థలు ఇక్కడ తమ కార్యకలాపాలు ప్రారంభించేందుకు ఆసక్తి చూపుతున్నాయని రాష్ట్ర ఐటీ, ఎలక్ట్రానిక్స్, విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ (Nara Lokesh) తెలిపారు. ముఖ్యమంత్రి చంద్రబాబు విజన్, ఆయన నాయకత్వంపై ఉన్న నమ్మకమే దీనికి కారణమని ఆయన తెలిపారు. విశాఖపట్నంలో నవంబర్ 14, 15 తేదీల్లో జరగనున్న ప్రతిష్ఠాత్మక ‘సీఐఐ పార్టనర్‌షిప్ సమ్మిట్’ నేపథ్యంలో, ముంబైలోని తాజ్ ప్యాలెస్ హోటల్‌లో పారిశ్రామికవేత్తలతో సిఐఐ ఏర్పాటు చేసిన రోడ్ షోలో లోకేశ్ పాల్గొన్నారు. నవంబర్లో విశాఖలో నిర్వహించే సీఐఐ భాగస్వామ్య సదస్సును విజయవంతం చేయాలని కోరుతూ ముంబయిలో నిర్వహించిన రోడ్ షో లో పలువురు పారిశ్రామికవేత్తలు అడిగిన ప్రశ్నలకు మంత్రి లోకేష్ సమాధానమిచ్చారు.
ఈ సందర్భంగా మంత్రి లోకేష్ మాట్లాడుతూ నైపుణ్యం పోర్టల్ ను నవంబర్ లో ప్రారంభించబోతున్నామన్నారు. దీనిద్వారా పరిశ్రమదారులు, యువత, స్కిల్ భాగస్వాములు ఒకే వేదికపైకి వస్తారు. పరిశ్రమ అవసరాలకు అనుగుణంగా కేజీ టు పీజీ వరకు కరిక్యులమ్ సమూల మార్పులు తెస్తామని ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాలు భారత్లో.. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ లో పెట్టుబడులకు ఆసక్తి చూపుతున్నాయని చెప్పారు. యూఏఈతో మా భాగస్వామ్యం చాలా బలంగా ఉంది. త్వరలో ముఖ్యమంత్రి యూఏఈ వెళ్లి అక్కడ పరిశ్రమదారులతో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహిస్తారు. దీనిద్వారా ఇరుదేశాల నడుమ సహకారాన్ని పెంపొందించేందుకు కృషిచేస్తున్నాం. ఏపీలో గత ప్రభుత్వ హయాంలో వెనక్కి వెళ్లిన సింగపూర్ తిరిగి తమ ఒప్పందాలను పునరుద్ధరించింది.
వ్యవసాయాధార రాష్ట్రమైన ఏపీలో హార్టీకల్చర్, పంట వైవిధ్యీకరణపై దృష్టిపెట్టాం. రాయలసీమలో అరటి, మామిడి వంటి వాటిని పంటలను ప్రోత్సహిస్తున్నాం. అదే సమయంలో డ్రాగన్ ఫ్రూట్, కర్జూరం వంటి పంటలపై ప్రయోగాలు కొనసాగుతున్నాయి. మత్స్య ఉత్పత్తుల్లో దేశంలోనే అగ్రగామిగా ఉన్నాం. డెయిరీ, అరకు కాఫీ, మిర్చి, పసుపు వంటి వ్యవసాయాధార పరిశ్రమల్లో కూడా భారీ పెట్టుబడులను ఆకర్షించాం. రైతు జీవన నాణ్యతను పెంపొందించడమే లక్ష్యంగా పనిచేస్తున్నాం. ఏపీలో స్టార్టప్ ల ప్రోత్సాహకానికి రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ ద్వారా ప్రత్యేక మెంటరింగ్ వ్యవస్థను ఏర్పాటు చేస్తున్నాం. ప్రతి నోడ్లో ఒక పెద్ద పరిశ్రమకు అనుసంధానంగా స్టార్టప్లను ప్రోత్సహిస్తున్నామని లోకేష్ వివరించారు. ఉక్కు, మెడికల్ డివైస్, ఫార్మా, క్రీడా రంగాల వారీగా ప్రోత్సహించడం, విద్యాసంస్థలను రప్పించచడానికి ప్రత్యేక హబ్ లను ఏర్పాటు చేస్తున్నాం. రాష్ట్రానికి స్పష్టమైన స్టార్టప్ పాలసీ ఉంది. ఇందుకు ఇంక్యుబేటర్ రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ పనిచేస్తోంది. ఐటీ రంగంలో 35 శాతం గ్లోబల్ టాలెంట్ భారతదేశానిది కాగా, దేశంలో 40శాతం ఐటీ నిపుణులు ఏపీ నుంచే తయారవుతున్నారు. విశాఖపట్నం, అమరావతిలో బిట్స్, విట్, ఎస్‌ఆర్‌ఎం, ఐఐటీ వంటి సంస్థలు వస్తున్నాయి. నైపుణ్యం ప్లాట్ ఫాం ద్వారా మనకు తక్షణమే అవసరమైన నిపుణులు అందుబాటులో ఉంటారు. పరిశ్రమలకు ఏం అవసరమో తెలియజేస్తే వారికి అవసరమైన నిపుణులను తయారు చేసేందుకు మేం సిద్ధంగా ఉన్నామని మంత్రి లోకేష్ చెప్పారు.
అలాగే పెట్టుబడులు పెట్టేవారికి ప్రభుత్వం అన్ని విధాలా సహకరిస్తుందని ఆయన హామీ ఇచ్చారు. డేటాసెంటర్ ఏర్పాటు కోసం కేంద్రంతో మాట్లాడి పాలసీలో మార్పులు తెచ్చామని, క్లస్టర్ల వారీగా అభివృద్ధి చేస్తూ పెట్టుబడులను ఆకర్షిస్తున్నామని ఆయన వివరించారు. కియా సంస్థకు ఇచ్చిన ప్రోత్సాహకాలను అనుబంధ పరిశ్రమలకు కూడా అందించి, ఆ ప్రాంతాన్ని అభివృద్ధి చేశామని తెలిపారు. ప్రస్తుతం ఫార్చ్యూన్ 500 కంపెనీలు రాష్ట్రం వైపు చూస్తున్నాయన్నారు అనకాపల్లి జిల్లాలో ఆర్సెలార్ మిత్తల్ ప్లాంట్ రాబోతోందని.. వేగవంతమైన వ్యాపార కార్యకలాపాలకు ( స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్) ఆర్సెలార్ మిత్తల్ ప్లాంటు నిదర్శనమన్నారు. ఆ కంపెనీకి జూమ్ కాల్‌లోనే అన్ని అనుమతులు మంజూరు చేశామని పేర్కొన్నారు. ఆర్సెలార్ మిత్తల్ స్టీల్ ప్లాంట్ పనులు ఈ ఏడాది నవంబరు నెలలో ప్రారంభమవుతున్నట్లు మంత్రి లోకేష్ తెలిపారు. ఆర్సెలార్ మిత్తల్, నిప్పన్ స్టీల్స్ సంయుక్తంగా రూ.1.47 లక్షల కోట్ల పెట్టుబడితో భారీ స్టీల్ ప్లాంట్‌ను ఏర్పాటు చేయనున్నాయి.
మొదటి దశలో రూ.70వేల కోట్ల పెట్టుబడి పెడుతున్నారు. ఈ ప్రాజెక్ట్ ద్వారా 2033 నాటికి దక్షిణాదిలోనే అతిపెద్ద ఉక్కు ఉత్పత్తి కేంద్రంగా అవతరించనుంది. ఈ ప్లాంట్ ఏర్పాటుతో ప్రత్యక్షంగా, పరోక్షంగా వేలాది మందికి ఉపాధి అవకాశాలు లభించనున్నాయి. నక్కపల్లి మండలంలో 2,020 ఎకరాల భూమిని దీని కోసం కేటాయించారు. ఈ ఒప్పందం ప్రకారం, ఆర్సెలార్ మిత్తల్ రెండు దశల్లో ప్లాంట్ నిర్మాణాన్ని పూర్తి చేయనుంది. ఈ ప్లాంట్ పూర్తయితే, విశాఖ ఉక్కుతో కలిసి ఉమ్మడి విశాఖ ప్రాంతంలో ఏటా 25.1 మిలియన్ మెట్రిక్ టన్నుల ఉక్కు ఉత్పత్తితో దక్షిణాదిలో అగ్రస్థానంలో నిలిచే అవకాశం ఉంది. రాష్ట్రంలో పెట్టుబడుల వాతావరణం అత్యంత సానుకూలంగా ఉందని, ప్రపంచ దిగ్గజ సంస్థలు ఏపీ వైపు చూస్తున్నాయని అన్నారు. టెక్నాలజీ రంగంలో మరో పెద్ద ముందడుగు వేస్తూ, ఈ నెల 14న ఒక గిగావాట్ సామర్థ్యమున్న గూగుల్ డేటా సెంటర్ ఏర్పాటు కోసం అవగాహన ఒప్పందం (ఎంఓయూ) కుదుర్చుకోనున్నట్లు ఆయన ప్రకటించారు. ఇందుకోసం కేంద్ర ప్రభుత్వంతో చర్చించి ప్రత్యేకంగా డేటా సెంటర్ పాలసీలో మార్పులు తీసుకువచ్చినట్లు తెలిపారు.
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చొరవతో విశాఖకు ముంబై కంటే రెట్టింపు సామర్థ్యం గల శక్తిమంతమైన సబ్‌మెరైన్ కేబుల్స్ వస్తున్నాయని తెలిపారు. పెట్టుబడుల ఒప్పందం కుదిరిన తర్వాత, ఆ ప్రాజెక్టును తమదిగా భావించి పూర్తి సహాయ సహకారాలు అందిస్తామని మంత్రి హామీ ఇచ్చారు. పెట్టుబడుల ఒప్పందం పూర్తయితే, ఆ ప్రాజెక్టును ప్రభుత్వ ప్రాజెక్టుగా భావించి, అన్ని విధాలా సహాయం చేస్తామని మంత్రి భరోసా ఇచ్చారు. 3,500 ఎకరాల్లో ఏరోస్పేస్ సిటీని అభివృద్ధి చేయనున్నట్లు మంత్రి లోకేశ్ పేర్కొన్నారు. పెట్టుబడులతో ముందుకు వచ్చేవారికి ప్రభుత్వం నుంచి పూర్తి సహకారం ఉంటుందని ఆయన భరోసా ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్‌కు పెట్టుబడులు వెల్లువెత్తడానికి ముఖ్యమంత్రి చంద్రబాబు ట్రాక్ రికార్డే ప్రధాన కారణమని లోకేశ్ అన్నారు. ‘‘గతంలో ఉమ్మడి రాష్ట్రంలో చంద్రబాబు సైబరాబాద్‌ను నిర్మిస్తే, అది ఇప్పుడు తెలంగాణకు పవర్ హౌస్‌గా మారింది. అదేవిధంగా, విభజిత ఏపీలో వెనుకబడిన అనంతపురం జిల్లాకు కియా మోటార్స్ ఫ్యాక్టరీని తీసుకురావడంతో, ఆ జిల్లా తలసరి ఆదాయం మూడు రెట్లు పెరిగింది. ఈ నమ్మకంతోనే ఫార్చ్యూన్ 500 కంపెనీలు సైతం మా రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి ముందుకు వస్తున్నాయి’’ అని ఆయన పేర్కొన్నారు.
యువతకు ఉద్యోగాలు కల్పించే లక్ష్యంతో టీసీఎస్, కాగ్నిజెంట్ వంటి సంస్థలకు కేవలం 99 పైసలకే ఎకరా చొప్పున భూములు కేటాయించామని తెలిపారు. తమ ప్రభుత్వ సమర్థ పాలన వల్ల గత 17 నెలల్లోనే విద్యుత్ ఛార్జీలను యూనిట్‌కు 13 పైసలు తగ్గించగలిగామని గుర్తుచేశారు. రాష్ట్రంలో కేవలం పెట్టుబడులు ఆకర్షించడమే కాకుండా, క్లస్టర్ల వారీగా అభివృద్ధిపై దృష్టి సారించామని లోకేశ్ తెలిపారు. ప్రధాన పరిశ్రమలకు అవసరమైన అనుబంధ యూనిట్లన్నీ 100 కిలోమీటర్ల పరిధిలోనే ఉండేలా ప్రోత్సహిస్తున్నామన్నారు. కియా మోటార్స్‌కు ఇచ్చిన ప్రోత్సాహకాలను దాని అనుబంధ పరిశ్రమలకు కూడా అందించి ఆ ప్రాంతాన్ని ఆటోమొబైల్ హబ్‌గా తీర్చిదిద్దామని ఉదహరించారు. భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకుని 3,500 ఎకరాల్లో ఏరోస్పేస్ సిటీని అభివృద్ధి చేయనున్నట్లు తెలిపారు. విశాఖపట్నం నగరం బెంగళూరు, గోవా నగరాల కలయికగా ఉంటుందని, అరకు వంటి పర్యాటక ప్రాంతాలతో పాటు, వ్యాపారానికి అనువైన వాతావరణం ఇక్కడ ఉందని చెప్పారు. ముంబై కంటే రెట్టింపు సామర్థ్యమున్న శక్తివంతమైన సముద్రగర్భ కేబుల్స్ విశాఖకు రానున్నాయని, ఇది డేటా ఆధారిత పరిశ్రమలకు ఎంతో కీలకమని అన్నారు.
రహేజా గ్రూప్ ప్రెసిడెంట్ నీల్ రహేజాతో భేటీ
విశాఖలో మైండ్ స్పేస్ బిజినెస్ పార్క్ ఏర్పాటు చేయాలని రహేజా గ్రూపుకు రాష్ట్ర విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ విజ్ఞప్తిచేశారు. రహేజా గ్రూప్ ప్రెసిడెంట్ నీల్ రహేజా తో ముంబయిలో సమావేశమైనప్పుడు ఈ మేరకు విన్నవించారు. రెసిడెన్షియల్, కమర్షియల్ రియల్ ఎస్టేట్, హాస్పిటాలిటీ, రిటైల్ మాల్స్, రిటైల్స్ స్టోర్స్, ఐటీ సెజ్ ల ఏర్పాటులో పవర్ డిస్ట్రిబ్యూషన్ వ్యాపార రంగంలో పేరెన్నికగన్న రహేజా గ్రూప్ 2024-25 ఆర్థిక సంవత్సరంలో రూ. 12 వేల కోట్ల ఆదాయాన్ని ఆర్జించింది. నీల్ రహేజాతో భేటీలో మంత్రి లోకేష్ మాట్లాడుతూ విశాఖపట్నంలో 100-150 ఎకరాల విస్తీర్ణంలో 100 మిలియన్ చదరపు అడుగుల గ్రేడ్- ఏ కార్యాలయ స్థలంతో మైండ్ స్పేస్ బిజినెస్ పార్కును అభివృద్ధి చేయాలని కోరారు. రహేజా గ్రూప్-ప్రిన్స్ టన్ డిజిటల్ గ్రూప్ భాగస్వామ్యాన్ని ఉపయోగించి దక్షిణ భారతదేశంలోనే అతిపెద్ద డేటా సెంటర్ హబ్ ను అమరావతి రాజధానికి సేవలందించే విధంగా 5 స్టార్ బిజినెస్ హోటల్‌ను ఏర్పాటు చేయాల్సిందిగా కూడా కోరారు. అమరావతి రాజధాని ప్రాంతంలో ప్రీమియం అప్‌ా ప్రాజెక్టులను (రహేజా హెరీమ్స్) ప్రారంభించాలని మంత్రి లోకేష్ కోరారు.
టాటా గ్రూపు చైర్మన్‌తో భేటీ
ఏపీలో మరిన్ని రంగాల్లో పెట్టుబడులు పెట్టాలని దిగ్గజ సంస్థ టాటా గ్రూపును రాష్ట్ర విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ కోరారు. టాటా గ్రూప్ ఛైర్మన్ చంద్రశేఖరన్‌తో మంత్రి నారా లోకేష్ ముంబయిలో భేటీ అయినప్పుడు పలు విషయాలను చర్చించారు. ఈ భేటీలో టాటా పవర్ రెన్యూవబుల్స్ సీఈవో సంజయ్ కుమార్ బంగా, ఇండియా హోటల్స్ ఎండీ పునీత్ ఛత్వాల్, టాటా ఎలక్సి సీఈవో మనోజ్ రాఘవన్, టాటా ఆటో కాంప్ సీఈవో మనోజ్ కోల్హాత్కర్, టాటా అడ్వాన్స్ డ్ సిస్టమ్స్ సీఈవో సుకరన్ సింగ్, టాటా ఎలక్ట్రానిక్స్ ఎండీ రణధీర్ ఠాకూర్, టాటా కెమికల్స్ ఎండీ ఆర్. ముకుందన్, టాటా ప్రాజెక్ట్స్ లిమిటెడ్ సీఈవో వినాయక్ పాయ్, ఎస్టి టి టెలీమీడియా గ్లోబల్ డేటా సెంటర్స్ సీఈవో బిమల్ ఖండేల్వాల్ కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి నారా లోకేష్ మాట్లాడుతూ విశాఖపట్నంలో రాష్ట్ర అగ్రనేతల సమక్షాన ఈ నెలలో నిర్వహించనున్న టీసీఎస్ డెవలప్మెంట్ సెంటర్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి హాజరుకావాల్సిందిగా వారిని ఆహ్వానించారు. టాటా పవర్ రెన్యూవబుల్స్ రాష్ట్రవ్యాప్తంగా ఎలక్ట్రిక్ వాహనాల ఛార్జింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అభివృద్ధి కోసం ఏపీ ప్రభుత్వంతో భాగస్వామ్యం వహించాలని కోరారు. రూఫ్ టాప్ సోలార్ అభివృద్ధి చేసే ప్రక్రియలో రాష్ట్ర ప్రభుత్వంతో కలిసి పనిచేసే మార్గాన్ని అన్వేషించాలని, రాష్ట్రంలో సెల్, మాడ్యూల్ మాన్యుఫాక్చరింగ్ యూనిట్ స్థాపనకు గల అవకాశాలను పరిశీలించాలని విజ్ఞప్తి చేశారు. విశాఖపట్నంలో టాటా ఎల్బీ రీజనల్ ఆఫీస్/ఇంజనీరింగ్ సెంటర్ ఏర్పాటు చేసి, తూర్పుతీరంలో ప్రధాన కేంద్రంగా అభివృద్ధి చేసే అవకాశాలను పరిశీలించాల్సిందిగా కూడా కోరారు.
టాటా ఆటోకాంప్ ఆధ్వర్యాన శ్రీసిటీలో ఎలక్ట్రిక్ వాహన భాగాలు, అధునాతన కంపోజిట్ మాన్యుఫాక్చరింగ్ యూనిట్లు స్థాపించే అవకాశాలను పరిశీలించాలని, ఇందుకు అవసరమైన భూమి, ప్లగ్ అండ్ ప్లే ఇన్ఫ్రాస్ట్రక్చర్ను ప్రభుత్వం అందిస్తుందన్నారు. పెట్టుబడి పరిమాణాన్ని ఆధారంగా తీసుకుని ఈవీ, ఎలక్ట్రానిక్ భాగాల తయారీ విధానంలో ప్రత్యేక ప్రోత్సాహకాలను ప్రభుత్వం అందిస్తుందని కూడా చెప్పారు.