అమరావతికి ఐటీ కళ
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి ఐటీ హబ్‌గా మారనుంది. ఇప్పటికే అనేక కంపెనీలు రాజధాని పరిధిలో కొలువు తీరగా, మరో 10 కంపెనీలు తమ కార్యకలాపాలను నేడు ప్రారంభించనున్నాయి. విజయవాడ, గుంటూరు, మంగళగిరి తదితర ప్రాంతాల్లో ఇప్పటి వరకు 100 ఐటీ కంపెనీలు ప్రారంభమయ్యాయి. ఈ కంపెనీల్లో 5వేల మంది వరకూ పని చేస్తున్నారు. తాడేపల్లిలో ఇన్ఫోసైట్ భవనలో నేడు 10 కొత్త ఐటీ కంపెనీలు ఏర్పాటు కానున్నాయి. 1000 మందికి ఈ కంపెనీల ద్వారా ఉపాధి లభించనుంది.
ఐటీ సెక్యూరిటీ, బిజినెస్ అనలిటిక్స్ అందిస్తున్న వైబర్ టెక్ సొల్యూషన్స్, మొబైల్ యాప్ తయారీకి ప్రసిద్ధి గాంచిన హెడ్రన్ టెక్నాలజీస్, ఇంజనీరింగ్ డిజైన్లు అందించే క్యాడిప్లాయ్, ఐటీ కన్సెల్టింగ్ సేవలు అందిస్తున్న సిఎస్ఎస్ టెక్నాలజీస్, యలమంచిలి, మెంటీస్, హెల్త్‌కేర్‌కు సంబంధించిన నార్మ్సాఫ్ట్వేర్, ప్రీమోస్టు ఐటీ సొల్యూషన్స్, యాక్స్ర్ వంటి సర్వీసెస్, ప్రోకామ్ సంస్థలు తమ కార్యకలాపాలను ఇక్కడ ప్రారంభించనున్నాయి. సిఎస్ఎస్ సొల్యూషన్స్ సంస్థ నోయిడాలోని తమ కార్యాలయాన్ని పూర్తి స్థాయిలో అమరావతికి తరలించనుంది.
గన్నవరం మేథా టవర్స్‌లో 90శాతం మేర నిండిపోగా, 11 వేల చదరపు అడుగుల విస్తీర్ణం మాత్రమే ఖాళీగా ఉండటంతో అక్కడ మరో ఆరు అంతస్తుల టవర్‌ను రాష్ట్ర ప్రభుత్వం నిర్మిస్తున్నది. ఇప్పటికే మూడ్లు ఫ్లోర్ల నిర్మాణం పూర్తి అయింది. మరో మూడు నెలల్లో ఈ టవర్ నిర్మాణం పూర్తి చేసేందుకు లక్ష్యంగా నిర్ణయించారు. ఈ టవర్‌లో ఆరున్నర లక్షల చదరపు అడుగుల విస్తీర్ణం అందుబాటులోకి వస్తుంది.













