Kotamreddy : కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి హత్యకు కుట్ర…?

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో (AP politics) సంచలన పరిణామం చోటు చేసుకుంది. నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి (Kotamreddy Sridhar Reddy) హత్యకు భారీ కుట్ర పన్నినట్లు ఓ వీడియో బయటకు వచ్చింది. ఐదుగురు రౌడీషీటర్లు (Rowdysheeters) మద్యం మత్తులో “కోటంరెడ్డిని చంపితే డబ్బే డబ్బు” అంటూ చర్చించుకుంటున్నట్లు కనిపిస్తోంది. దీంతో ప్రభుత్వం అప్రమత్తమైంది. పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. వైసీపీనే తన హత్యకు కుట్ర పన్నిందని ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఆరోపించారు. తన రక్షణకు పోలీసులు బాధ్యత తీసుకోవాలని కోరారు.
2014లో వైసీపీ నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికైన కోటంరెడ్డి 2024 వరకూ ఆ పార్టీలో కొనసాగారు. తర్వాత అధిష్టానంతో మనస్పర్థలు రావడంతో వైసీపీని వీడి టీడీపీ గూటికి చేరారు. తాజా ఎన్నికల్లో టీడీపీ (TDP) నుంచి పోటీ చేసి గెలిచారు. ఆయన్ను హతమార్చేందుకు నెల్లూరులో కొంతమంది రౌడీ షీటర్లు కుట్ర చేశారనే వార్తలు ఇప్పుడు కలకలం రేపుతున్నాయి. కోటంరెడ్డిని లేపేస్తే డబ్బే డబ్బు అని ఆ రౌడీషీటర్లు మాట్లాడుకుంటున్న వీడియో బయటికొచ్చింది. ఆ వీడియోలో రౌడీషీటర్లు జగదీష్, మహేష్, వినీత్, మల్లి ఉన్నారు. ఈ గ్యాంగ్ వెనుక రౌడీషీటర్ శ్రీకాంత్ (Rowdy Sheeter Srikanth), అతని ప్రియురాలు నిడిగుంట అరుణ (Nidigunta Aruna) ఉన్నారని టీడీపీ వర్గాలు ఆరోపిస్తున్నాయి. శ్రీకాంత్ ప్రస్తుతం జైలులో ఉండగా, అరుణ ఇటీవల అరెస్టయ్యారు.
కోటంరెడ్డి హత్యకు కుట్ర వెనుక వైసీపీ (YCP) పెద్దల హస్తం ఉందని టీడీపీ ఆరోపిస్తోంది. ఎమ్మెల్యేను చంపితే రానున్న ఎన్నికల్లో గూడూరు లేదా సూళ్లూరుపేటలో టిక్కెట్ ఇస్తామని నిడిగుంట అరుణకు వైసీపీ నేతలు హామీ ఇచ్చినట్లు టీడీపీ శ్రేణుల్లో చర్చ జరుగుతోంది. కోటంరెడ్డిని సన్నిహితంగానే ఉంటూ ఆయన్ను హతమార్చేందుకు ఈ గ్యాంగ్ కుట్ర చేసిందని అనుమానిస్తున్నారు. అందులో భాగంగానే కోటంరెడ్డితో శ్రీకాంత్ పెరోల్ కు దరఖాస్తు చేయించుకున్నారు. ఇలా చేయడం ద్వారా అనుమానం రాకుండా ఉంటుందని స్కెచ్ వేసినట్లు తెలుస్తోంది.
ఈ వీడియో వైరల్ కావడంతో నెల్లూరు ఎస్పీ కృష్ణకాంత్ స్పందించారు. వీడియోపై దర్యాప్తు జరుగుతోందని.. డీజీపీ దృష్టికి తీసుకెళ్లామని వివరించారు. ఈ వీడియోలో ఉన్న మహేష్, వినీత్, మల్లిలను పోలీసులు అరెస్టు చేశారు. జగదీష్ ఇప్పటికే జైలులో ఉన్నట్టు తెలుస్తోంది. అరుణ ఫోన్‌లో హత్య కుట్రకు సంబంధించిన వివరాలు ఉన్నాయని సమాచారం.
ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఈ వీడియోపై స్పందించారు. రూరల్ ఎమ్మెల్యేను చంపేస్తే డబ్బే డబ్బు అన్నారని… ఆ డబ్బు ఎవరు ఇస్తున్నారో పోలీసులు తేల్చాలని ఆయన డిమాండ్ చేశారు. వైసీపీ కుట్రలను సీరియస్‌గా తీసుకోవాలని, నా రక్షణ బాధ్యత పోలీసులు తీసుకోవాలని కోటంరెడ్డి కోరారు. నేను రౌడీలకు భయపడే వ్యక్తిని కాదని, చివరి శ్వాస వరకు ప్రజాజీవితంలో కొనసాగుతానని స్పష్టం చేశారు.
కోటంరెడ్డి హత్య కుట్ర వ్యవహారం ఇప్పుడు నెల్లూరు జిల్లానే కాక రాష్ట్రాన్ని కూడా కలవరపాటుకు గురి చేసింది. నిడిగుంట అరుణ ఫోన్లో మరిన్ని వీడియోలు ఉన్నాయని సమాచారం. అయితే ఫోన్ పాస్ వర్డ్ మర్చిపోయానని అరుణ చెప్తుండడంతో వాటిని చూసేందుకు పోలీసులకు వీలు కావట్లేదు. ఒకవేళ ఆ వీడియోలు కూడా బయటకు వస్తే మరిన్ని సంచలనాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది.