మూడు రాజధానులనేది భ్రమ: వైసీపీ ఎంపీ
మూడు రాజధానులు అనేది కేవలం భ్రమ మాత్రమేనని వైసీపీ ఎంపీ రఘురామకృష్ణరాజు వ్యాఖ్యానించారు. గత కొన్నిరోజులుగా నేరుగా జగన్ను లక్ష్యంగా చేసుకుని విమర్శలు చేస్తున్న ఎంపీ..మరోసారి తన విమర్శల వర్షాన్ని కురిపించారు. జగన్కు తెలుగు సరిగా రాదని అన్నారు. కరోనా ఇప్పట్లో పోదనే విషయాన్ని చెప్పడానికి సహజీవనం అనే పదాన్ని వాడారన్నారు. వీలైనంత తొందరగా విశాఖకు వెళ్లిపోవాలనే ఆలోచనలో జగన్ ఉన్నారని ఇంకా ఉంటారని ఆయన ఎద్దేవా చేశారు. తన నియోజకవర్గంలో 30 మంది కంటే తక్కువ కరోనా రోగులు ఉన్న గ్రామమే లేదని కాని సిఎంకి అంతకంటే రాజధాని మార్పే ముఖ్యమైపోయిందన్నారు. కరోనాను చాలా సీరియస్ గా చూడాలని… దాన్ని జగన్ లైట్ గా తీసుకోవడం వల్లే రాష్ట్రంలో ఈ పరిస్థితి వచ్చిందన్నారు. విశాఖ కు తరలింపు కోసం కేటాయిస్తున్న సమయాన్ని కరోనా నిర్మూలన కోసం వెచ్చించాలని హితవు పలికారు.
మా పార్టీలో విలువలు మాటల వరకే
తమ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వం కాంట్రాక్టర్లకు రూ. 25 వేల కోట్ల వరకు బకాయి పడిందని చెప్పారు. ప్రత్యేకించి ఒక సామాజికవర్గానికి చెందిన కాంట్రాక్టర్లకు డబ్బులు చెల్లించడం లేదని విమర్శించారు. తమ పార్టీలో విలువలు మాటలకే పరిమితమయ్యాయని… విలువలు అనేవి చేతల్లో కూడా ఉండాలని హితవు పలికారు. కాంట్రాక్టర్ల కష్టాలు ముఖ్యమంత్రి దృష్టికి వెళ్లడం లేదేమోనన్నారు. వీటిని సీఎం దృష్టికి అధికారులు ఎందుకు తీసుకెళ్లడం లేదని ప్రశ్నించారు.













