ఆడబిడ్డలకు రక్షణ కవచంగా ఉంటా : చంద్రబాబు
రాష్ట్రంలోని ఆడ్డబిడ్డలకు తమ ప్రభుత్వం రక్షణ కవచంగా ఉంటుందని, ఈవ్‌టీజింగ్, మహిళలను వేధించేవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. రాఖీ పౌర్ణమి పండుగను పురష్కరించుకుని ఉండవల్లిలోని ముఖ్యమంత్రి నివాసానికి వచ్చిన నేతలు ఆయనకు రాఖీలు కట్టి శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్ర మంత్రి పరిటాల సునీత, మాజీమంత్రి పీతల సుజాత, రాష్ట్ర తెలుగుమహిళ అధ్యక్షురాలు శోభా హైమావతి, గద్దె అనురాధ, ఆచంట సునీత, బ్రహ్మకుమారీలు, తెలంగాణ తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధులు సీతక్క, దూలం రాధిక రాఖీలు కట్టిన వారిలో ఉన్నారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ రాష్ట్ర ప్రజలకు, దేశ విదేశాల్లోని తెలుగువారికి రక్షాబంధన్ శుభాకాంక్షలు తెలియజేశారు. తమ కుటుంబాలకు మంచి జరగాలని చెప్పారు. పంటలు సమృద్ధిగా పండి సిరులు కురిపించాలని నేల తల్లికి పూజలు చేసిన నాట్లు వేసే సమయం కూడా ఇదేనని పేర్కొన్నారు. ఆపదల్లో ఉన్న మహిళలకోసం అభయ హస్తం యాప్‌ను రూపొందించామని, అదేవిధంగా వారి గౌరవం పెంపొదించేందుకు అమ్మకు వందనం కార్యక్రమానికి శ్రీకారం చుట్టినట్లు తెలిపారు. అంతేకాకుండా మహిళల ఆరోగ్య సంరక్షణకు కూడా ప్రభుత్వం అనేక పథకాలు చేపట్టిందని వెల్లడించారు.













