చిరంజీవికి కృతజ్ఞతలు తెలిపిన కొల్లు
ఎంపీ ల్యాడ్స్ ద్వారా కృష్ణా జిల్లా మచిలీపట్నంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు తోడ్పడిన మాజీ ఎంపీ చిరంజీవికి ఆంధ్రప్రదేశ్ మంత్రి కొల్లు రవీంద్ర కృతజ్ఞతలు తెలిపారు. హైదరాబాద్లోని చిరంజీవి నివాసంలో ఆయన్ని కలిశారు. రాజ్యసభ సభ్యునిగా ఉన్న సమయంలో చిరు సహకారంతో మచిలీపట్నంలో రూ.5 కోట్లతో చేపట్టిన పలు అభివృద్ధి పనులు వివిధ దశల్లో ఉన్నాయని, ఏడాదిలోగా ఈ పనులన్నింటినీ పూర్తి చేస్తామని రవీంద్ర తెలిపారు. మచిలీపట్నం నియోజకవర్గ ప్రజలు చిరంజీవికి రుణపడి ఉంటారన్నారు. తాను కేటాయించిన నిధులతో ప్రారంభించిన పనులు విజయవంతంగా సాగడం పట్ల చిరంజీవి హర్షం వ్యక్తం చేశారు.













