2030 నాటికి పారిశ్రామిక హబ్‌గా ఏపీ
రకరకాల పరిశ్రమలను ఆకర్షిస్తూ 2030 నాటికి దేశంలోనే పారిశ్రామిక హబ్‌గా ఆంధ్రప్రదేశ్ మారనుందని రాష్ట్ర పరిశ్రమలు, పుడ్ ప్రాసెసింగ్, అగ్రి బిజినెస్, కామర్స్, పబ్లిక్ ఎంటర్ప్రైజెస్ శాఖ మంత్రి ఎన్. అమర్నాథరెడ్డి తెలిపారు. ముఖ్యమంత్రి చంద్రబాబుపై నమ్మకంతో రాష్ట్రంలో పరిశ్రమలు నెలకొల్పడానికి ఎన్నో ప్రఖ్యాత సంస్థలు ముందుకు వస్తున్నాయన్నారు. వచ్చే ఏడాది డిసెంబర్ నాటికి రాష్ట్రంలో రూ.12వేల కోట్ల పెట్టుబడితో కియో కార్ల పరిశ్రమ రానుందని, ఇందుకు సంబంధించిన ఎఒయూ పూర్తయిందన్నారు. కియో కార్ల పరిశ్రమ వల్ల 11 వేల మందికి ఉద్యోగాలు లభించనున్నాయని అన్నారు. తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో ఆయన మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో ఆటో మోబైల్, టైర్ల ఫ్యాక్టరీలు ఎన్నో రానున్నాయన్నారు. కోస్టల్ కారిడార్‌లో రూ.550 కోట్ల పెట్టుబడులతో పుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు ఏర్పాటు కానున్నాయన్నారు. రాష్ట్రంలో 950 కిలో మీటర్ల పరిధిలోని కోస్టల్ కారిడార్‌లో అనేక పరిశ్రమలు వస్తున్నాయన్నారు. చిన్న పరిశ్రమలు, పెద్ద ఉపాధి అనే విధానంలో మైక్రో స్థాయి పరిశ్రమలను నెలకొల్పడం జరుగుతోందన్నారు. రాష్ట్రంలో విద్యుత్‌కు డోకాలేదని, అవసరమైన భూములు అందుబాటులో ఉన్నాయని, పోర్టులు, విమానాశ్రయాలు, జాతీయ రహదారులు పరిశ్రమలకు అనుకూలంగా ఉన్నాయని పేర్కొన్నారు. చిత్తూరులో శ్రీసిటి, కాకినాడలోని కెఎస్ఇ జడ్లో పెద్ద ఎత్తున పరిశ్రమలు రానున్నాయని దీనివల్ల ఉద్యోగావకాశాలు పెరగనున్నాయన్నారు.













